చంద్రబాబు గెలిస్తే పెన్షన్ 4 వేలు-జగన్ గెలిస్తే ఎంత ?
ఏపీలో సామాజిక పెన్షన్లు గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 200 నుంచి వెయ్యి రూపాయలకు పెరిగిన సామాజిక పెన్షన్లు ఆ తర్వాత రెండు వేలకు చేరుకున్నాయి. గత ఎన్నికల వేళ 3 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా జనం నమ్మలేదు. అయితే అదే 3 వేలు ఇస్తామని చెప్పిన జగన్ ను నమ్మి ఓటేశారు. కానీ ఆ 3 వేలు విడతల వారీగా పెంచుతానని తాను చెప్పానన్న జగన్.. ఈ ఐదేళ్లలో దాన్ని పెంచారు.
ఇప్పుడు మరోసారి ఎన్నికల వేళ చంద్రబాబు తాను గెలిస్తే పెన్షన్లను 4 వేలకు పెంచుతానని నిన్న తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓటర్లకు హామీ ఇచ్చారు. అలాగే ఒకటి, రెండు నెలలు పెన్షన్లు తీసుకోకపోయినా మూడో నెలలో ఈ మూడు నెలల మొత్తం కలిపి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు అధికార వైసీపీ పెన్షన్లపై ఏ హామీ ఇవ్వబోతోందన్నది కీలకంగా మారింది. ఎందుకంటే 4 వేలే ఇస్తామంటే చంద్రబాబు కూడా అదే చెప్తున్నాడుగా అంటారు. మరి జగన్ ఏం చేయబోతున్నారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ ఇద్దరూ పెన్షన్ 3 వేలే ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే విశ్వసనీయత కోణంలో చూసిన ఓటర్లు జగన్ అయితే కచ్చితంగా ఇస్తాడని భావించారు. అందుకే భారీ ఎత్తున ఓట్లు వేశారు. అయితే అధికారంలోకి రాగానే ఈ మూడు వేలు విడతల వారీగానే అంటూ ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ, మధ్యలో ఓ ఏడాది వదిలేసి చివరికి రూ. 3 వేలకు పెంచి హామీ నిలబెట్టుకున్నారు జగన్. దీంతో ఇప్పుడు జగన్ ఈసారి పెన్షన్ ఎంతకు పెంచుతారు, ఎలా పెంచుతారన్న దానిపై చర్చ జరుగుతోంది.
వైసీపీ మ్యానిఫెస్టోను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటివరకూ అనుకుంటున్న ప్రకారమైతే పెన్షన్ ను 4 వేలకే పెంచాలని జగన్ కూడా భావిస్తున్నారు. అయితే అది విడతల వారీగానా లేక ఎన్నికలు పూర్తయి అధికారంలోకి రాగానేనా అనేది తేలాల్సి ఉంది. దీనిపై జగన్ క్లారిటీ ఇస్తే మాత్రం చాలా లెక్కలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications