కెసిఆర్ హామీ: టిలో స్వామి నారాయణ్ విశ్వవిద్యాలయం
హైదరాబాద్: తెలంగాణలో స్వామినారాయణ్ గురుకుల్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు స్వామినారాయణ్ గురుకుల అంతర్జాతీయ విద్యా సంస్థ ముందుకు వచ్చింది. గురుకుల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును సంస్థ ప్రతినిధులు కోరారు.
ఢిల్లీలో అక్షరధామ్‌ను నిర్వహిస్తున్న స్వామి నారాయణ్ గురుకుల్ విద్యాసంస్థల ప్రతినిధులు ప్రసాద్ స్వామి, సర్వమంగళ స్వామి, నిశ్చల స్వామిలు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో భేటీ అయ్యారు.

తెలంగాణలో స్వామి నారాయణ్ గురుకుల్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న యోచనలో తాము ఉన్నామని, అనువైన స్థలాన్ని కేటాయించాలని వారు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరారు. విశ్వవిద్యాలయంతోపాటు కంటి ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు సిఎంకి తెలిపారు.
గురుకుల్ యూనివర్శిటీని తెలంగాణలో స్థాపించడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని సిఎం కెసిఆర్ వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఉన్నాయని, కొత్తగా వచ్చే ఈ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో మరో అనువైన చోట పెట్టుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి సూచించారు.












Click it and Unblock the Notifications