చిరు అంటూనే, ఆయనకే తెలియదు: పవన్‌పై టిఎస్సార్
విశాఖ/విజయవాడ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదని, ఆయన ఆలోచనల్లో నిలకడ ఉండదన్నారు. ఇంటికే పరిమితమైన వ్యక్తి ఒక్కసారిగా బయటకు వచ్చి దేశానికి సేవ చేస్తానంటే ఎవరు నమ్ముతారన్నారు.
కాంగ్రెస్‌ను విమర్శించే ముందు పవన్ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఓ వైపు చిరంజీవిని ఆరాధిస్తూనే మరోవైపు కాంగ్రెస్‌ను విమర్శించడం ద్వంద్వ నీతిని పాటించినట్లు కాదా అన్నారు. విభజనకు కారణమైన బిజెపికి, మోడీకి ఎందుకు మద్దతుస్తున్నారో ఆయనకే తెలియదన్నారు.

విజయవాడలో మోడీ
ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని తమ పార్టీతో సహా ఏ పార్టీ ప్రయత్నాలు చేయలేదని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు విజయవాడలో అన్నారు. టిడిపి, బిజెపిల పొత్తు రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. వైయస్ ఉన్నప్పుడే తెరాసతో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. విభజన అంశం ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.
దేశ, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్నారు. టిడిపితో తాము పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నిస్తున్న తెరాస ముందు తాను ఆత్మ విమర్స చేసుకోవాలన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మోడీ ప్రభుత్వంలో ఎపి భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ నేతలంతా ప్రధానులు కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
దేశ వ్యాప్తంగా మోడీ హవా నడుస్తోందని, ఆయన నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications