తుపాను కష్టాల్లో ఏపీకి అండగా విజయ్ ప్రభుత్వం, కీలక నిర్ణయం..!!
తుఫాను ఏపీకి భారీ నష్టం మిగుల్చింది. ఆర్నాబ్ తుఫాను కారణంగా రూ 4,563 కోట్ల నష్టంగా ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం నుంచి ప్రత్యేక టీంలు చేరుకుంటున్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేసారు. ఇప్పటికీ కోనసీమలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. కాగా.. ఏపీ ప్రభుత్వ అభ్యర్ధన మేరకు తమిళనాడు ప్రభుత్వం సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
ఆర్నాబ్ తుఫాను ధాటికి ఉత్తరాంధ్ర.. కోనసీమ ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. పెద్ద ఎత్తున విద్యుత్ వ్యవస్థ పైన ప్రభావం పడింది. తుపాను సృష్టించిన విధ్వంసంతో విద్యుత్ సరఫరా పలు ప్రాంతా ల్లో నిలిచిపోయింది. దీంతో.. తుపాను అర్నబ్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. తుపాను సృష్టించిన విధ్వంసం, విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, లైన్లు, ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులకు అదనపు సిబ్బంది, సామగ్రి అవసరమని తెలిపారు.

సానుకూలంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని మంత్రి గొట్టిపాటి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం.. ఏపీకి విద్యుత్ సిబ్బందితో పాటు అవసరమైన సామగ్రిని పంపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు మరింత బలం చేకూరనుంది.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విద్యుత్ పునరుద్ధరణ పనులకు సహాయం అందించాలని కోరింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని మరమ్మతు పనుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు తమిళనాడు నుంచి కూడా సిబ్బంది, సామగ్రి అందుబాటులోకి వస్తే సహాయక చర్యలు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications
