తెలంగాణాలో పెట్టుబడులు పెడితే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు: సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. ఎలాంటి సంకోచం లేకుండా మీ పెట్టుబడులు పెట్టండి. నేను మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటాను అని ఆయన దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026'కు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు దిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాపారం గురించి మీకు నాకంటే బాగా తెలుసు. మీ మాటలు విని, అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. తెలంగాణలో మీ పెట్టుబడులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. అవి వృద్ధి చెందుతాయి. మీరు మనసులో ఉంచుకున్న సంఖ్యను రెట్టింపు చేసి పెట్టుబడి పెట్టండి. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలను తీసుకెళ్లండి అని ఆయన స్పష్టం చేశారు.

విధానపరమైన మద్దతు కావాలంటే తాను వ్యక్తిగతంగా గ్యారంటీ ఇస్తానని కూడా చెప్పారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నందున కొందరు సంకోచిస్తున్నారని తెలిసి, సీఎం ఆ అంశాన్ని ప్రస్తావించారు. మేము కేంద్రంతో పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొనడమే దీనికి నిదర్శనం అన్నారు.
కేంద్రం దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె కారిడార్లు తెలంగాణకు దక్కాయి. వరంగల్, ఆదిలాబాద్‌లకు కొత్త ఎయిర్‌పోర్టులు మంజూరు చేశారు. రీజినల్ రింగ్ రోడ్ నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ వరకు అనేక పథకాల్లో కేంద్రం పూర్తి మద్దతు ఇస్తోంది అని వివరించారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ నాయకత్వాల పుట్టినిల్లుగా అభివర్ణించిన సీఎం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ మాజీ సీఈవో శాంతను నారాయణ్ వంటి వారు ఈ నగరం నుంచే ఎదిగారని గుర్తు చేశారు. నిజాం నెలకొల్పిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎంతో మంది ప్రపంచ స్థాయి వ్యక్తులను తయారు చేసిందని చెప్పారు. భారత్ ఈరోజు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి రాజీవ్ గాంధీ, పీవీ నరసింహా రావుల కృషి కారణమని కూడా ప్రస్తావించారు.మీ పెట్టుబడులకు మాది భరోసా అని గుర్తు చేశారు.
కాగా తెలంగాణ సంస్కృతి, కాకతీయ కళాతోరణాలు, బతుకమ్మ సంప్రదాయాలతో సమిట్‌కు వచ్చే పారిశ్రామికవేత్తలను స్వాగతించనున్నారు.సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ డీఎన్‌ఏలోనే సంస్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక తత్వం ఉందని చెప్పారు. హైదరాబాద్ గాలి, నీటిలోనే ప్రపంచ స్ఫూర్తి ఉందని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు పెట్టుబడిదారులను ఆలోచించేలా చేస్తున్నాయి. మరి డిసెంబర్ లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఎంతమంది పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తుందో తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
