సీఎంగా పవన్ కూ ఛాన్స్, తేల్చేసిన లోకేష్ - జనసేన వాట్ నెక్స్ట్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. జగన్ గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలతో ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది. ఇదే సమయంలొ టీడీపీ, జనసేన పొత్తులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ సీఎం కావాలనేది అభిమానులు, జనసైనికుల ఆశలు. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు - పవన్ సీఎం పదవి షేర్ చేసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఈ సమయంలోనే లోకేష్ ఈ ప్రతిపాదన పైన క్లారిటీ ఇచ్చేసారు.
మారుతున్న లెక్కలు
టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఎలాగైనా జగన్ ను ఓడించాలనే లక్ష్యంతోనే టీడీపీతో జత కట్టానని పలు సందర్భాల్లో పవన్ చెబుతూ వచ్చారు. సీఎం పదవి గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి గురించి డిమాండ్ చేద్దామని చెప్పుకొచ్చారు. అభిమానులు మాత్రం పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు.

దీంతో..టీడీపీ - జనసేన మధ్య సీట్లతో పాటుగా అధికారంలోనూ షేరింగ్ ఉంటుందనే అంచనాలతో జనసేన నేతలు, కేడర్ ఉంది. దీని ద్వారా చంద్రబాబు - పవన్ సీఎం పదవిని పంచుకుంటారనే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ సీట్లు పంపకాలు ఉంటాయి కానీ, ముఖ్యమంత్రి షేరింగ్ ఉండదని తేల్చి చెప్పారు.
పవన్ కు సీఎంగా నో ఛాన్స్
ప్రముఖ జర్నలిస్టు జాఫర్ చేసిన ఒక ఇంటర్వ్యూలో లోకేష్ ను ఈ అంశం పైన స్పష్టత కోరారు. సీట్లు పంచుకున్నట్లుగా ముఖ్యమంత్రి పదవి పంచుకోవటం ఉంటుందా అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన లోకేష్ అసలు ఈ విషయంలో రెండో ఆలోచనే లేదన్నారు. చాలా స్పష్టంగా ఉన్నామని..చంద్రబాబు సీఎం అవుతారని గట్టిగా చెప్పారు.
సీఎం సీటు పై నారా లోకేష్ క్లారిటీ..పవన్ కళ్యాణ్ కు లేదని స్పష్టం..!! pic.twitter.com/hygUILYJ0e
— oneindiatelugu (@oneindiatelugu) December 21, 2023
అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని పవన్ కూడా చెప్పారని గుర్తు చేసారు. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని లోకేష్ తేల్చి చెప్పారు. దీంతో..ఒక వేళ ఎన్నికల్లో గెలిచి టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు మాత్రమే పూర్తి కాలం ముఖ్యమంత్రి గా ఉంటారని లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
జనసేన వాట్ నెక్స్ట్
పవన్ ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. పవన్ మద్దతుతో అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పవన్ పరామర్శకు వెళ్లి అక్కడే పొత్తు ప్రకటన చేసారు. తాజాగా లోకేష్ యువగళం ముగింపు సభకు పవన్ దూరంగా ఉన్నారు. కానీ, పవన్ ఇంటికి వెళ్లి స్వయంగా చంద్రబాబు ఆహ్వానించటంతో తిరిగి పవన్ హాజరయ్యారు.

సీట్లు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన పైన కసరత్తుకు నిర్ణయించారు. జనసేనకు 27 అసెంబ్లీ 2 లోక్ సభ సీట్లు ఇవ్వాలని నిర్ణయంచినట్లు చెబుతున్నారు. ఇక..ప్రభుత్వంలో సీఎం పదవిలోనూ పవన్ కు షేరింగ్ ఉంటుందని భావిస్తున్న జనసేన నేతలకు ఇప్పుడు లోకేష్ ఇచ్చిన క్లారిటీతో ఇక ఆ ఛాన్స్ లేదనే విషయం అర్దమవుతోంది. దీని ద్వారా చంద్రబాబుతో సమానంగా తమ నేత సీఎం అవుతారని భావిస్తున్న జనసైనికులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications