నూజివీడు టీడీపీ ఇన్ ఛార్జ్ గా వైసీపీ ఎమ్మెల్యే-అనూహ్య ప్రకటన..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా పలువురు అభ్యర్ధులకు సీట్లు లేకుండా పోయాయి. వీరంతా ఇప్పుడు టీడీపీ బాట పట్టారు. చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలతో భేటీ అయ్యి సీట్లు ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. అయితే ఇదే క్రమంలో వైసీపీలో సీటు దక్కని ఎమ్మెల్యే ఒకరిని పార్టీలో తీసుకోకుండా ఇవాళ టీడీపీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించేసింది.

వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీట్లు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి కూడా ఒకరు. వైసీపీలో టికెట్ లేకపోవడంతో ఆయన పార్టీ మార్పుకు సిద్దపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ లో భేటీ అయి చర్చలు జరిపారు. అయితే టీడీపీ తీర్ధం మాత్రం పుచ్చుకోలేదు. దీనికి కారణం ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు స్ధానంలో తనకు సీటు ఇవ్వాలని పట్టుబట్టడమే. దీనికి టీడీపీ అంగీకరించలేదు.
పెనమలూరు సీటు విషయంలో టీడీపీలో గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే అక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న బోడే ప్రసాద్ తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమ, వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తారని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లలో ఒకరి కోసం ఈ సీటును టీడీపీ రిజర్వు చేసింది. దీంతో పార్ధసారధిని నూజివీడు వెళ్లాలని సూచించింది. దీనిపై కొన్ని రోజులుగా మల్లగుల్లాలు పడుతున్న పార్ధసారధి ఎట్టకేలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పేరును నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ ప్రకటించారు. అయితే టీడీపీలో చేరకుండానే పార్ధసారధి పేరును నూజివీడు ఇన్ ఛార్జ్ గా ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications