
మద్యంలో తాడేపల్లి ప్యాలెస్ టార్గెట్ 10 వేల కోట్లు..! జగన్ దే చీప్ లిక్కర్ బ్రాండ్ !! అచ్చెన్నాయుడు
ఏపీలో కల్తీ మద్యం మాఫియా నడుస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. వారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండగా ఉన్నారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేసే దౌర్భాగ్యం ఈ రాష్ట్రాంలో ఉందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చాక ప్రజలను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. మద్యం ఆదాయాన్ని తగ్గించుకుంటూ వెళ్తామని జగన్ చెప్పలేదా ? అని నిలదీశారు.

మద్యంలో జగన్ ఆదాయం రూ. 10 వేల కోట్లు?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు అంతు లేకుండా పోయిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తను చంపి భార్యకు అమ్మఒడి ఇస్తారా? కొడుకును చంపి వారి తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దేశంలో ఎక్కడైనా ఉందా..? అని నిలదీశారు. ఐదేళ్లలో మద్యం ద్వారా రూ. 10 వేల కోట్లు ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు రావాలని సీఎం జగన్ టార్గెట్ పెట్టుకున్నారని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.

చిప్ లిక్కర్ బ్రాండ్ జగన్ దే..!
అందుకే జగన్ ప్రభుత్వం కొత్త కొత్త బ్రాండ్లు, పాలసీలను తీసుకువస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాటా అవాస్తమేనని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్ బ్రాండ్ జగన్ దే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బ్రాండ్ అభివృద్ధి అని అన్నారు. రాష్ట్రంలో లిక్కర్ తయారీ కంపెనీలన్నీ తన వద్దకు వచ్చి.. ముడుపులు చెల్లించుకోవాలన్నది జగన్ పాలసీ అని ఆరోపించారు. ముడిపులు తీసుకుని కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చారని నిప్పులు చెరిగారు.
డిస్టిలరీలు నడుపుతోంది జగన్ బినామీలే..
రాష్ట్రంలో డిస్టిలరీలను నడుపుతోంది సీఎం జగన్ బినామీలేనని అచ్చెన్నాయుడు విమర్శించారు. చంద్రబాబు పాలనలో డిస్టిలరీలను తెచ్చామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. వాటిని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు చంద్రబాబు అభివృద్ధి బ్రాండ్ ఉంటుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి తరహాలో చంద్రబాబు నాయుడుది చీప్ లిక్కర్ బ్రాండ్ కాదని దుయ్యబట్టారు. 2014-15లో రూ. 11,569 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవని గుర్తు చేశారు. కానీ 2021-22లో రూ.24,714 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. రూ. 11వేల కోట్ల నుంచి రూ. 24 వేల కోట్లకు ఆదాయం పెరిగిందా ? లేదా? అని నిలదీశారు. కల్తీ మద్యం తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని దుయ్యబట్టారు.