Macherla Violence: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి-కారు ధ్వంసం-10మందికి గాయాలు..!
ఏపీ ఎన్నికల సందర్భంగా విచ్చలవిడిగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు, ఆస్తుల ధ్వంసం నిరాటంకంగా కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, హింస చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం చెప్పుకున్న గొప్పలన్నీ ఒట్టిమాటలే అని తేలిపోతున్నాయి. దీంతో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో మధ్యాహ్నం దాటినా హింస అదుపులోకి రావడం లేదు.
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడికి కొందరు ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు ఆయన బయలుదేరుతున్న క్రమంలో ఒక్కసారిగా ప్రత్యర్థులు దాడికి దిగారు. కర్రలు, రాడ్లు, మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పిన్నెల్లి కారు కూడా ధ్వంసమైంది.

పిన్నెల్లి కాన్వాయ్ లో పలు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. పిన్నెల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన 10 మంది వైసీపీ కార్యకర్తలకూ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి తలలు కూడా పగిలాయి. పోలీసులు స్పందించి దాడుల్ని అడ్డుకున్నా అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. దీంతో పల్నాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గమే ఈ దాడులకు పాల్పడినట్లు పిన్నెల్లి వర్గం ఆరోపిస్తోంది. దాడులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications