తెలుగుదేశం పార్టీ విధి విధానాలను సమూలంగా మార్చేయబోతున్న చంద్రబాబు!!
తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు రాజకీయ చాణక్యుడు అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరంలేదు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన బాబు ఒక సూత్రాన్ని మరిచిపోతున్నారనే సందేహాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది ప్రకృతి నియమం. అప్పుడు మనం కూడా కాలంతోపాటు మారాలి. లేదంటే మనుగడ ఉండదు. అయితే ఈ సూత్రాన్ని చంద్రబాబు మరిచిపోయినట్లున్నారని ఆ పార్టీ శ్రేయోభిలాషులు అంటున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీని నడపాలని, ఉరకలెత్తించాలని శ్రేణులు కోరుతున్నాయి. పార్టీకి మొదటి నుంచి మీడియా మద్దతు ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. జర్నలిస్టులతో ఆయన సాన్నిహిత్యంగా మెలగడం, వారిని గౌరవించడం చేసేవారు. దీంతో సహజంగానే ఎక్కువ మంది మీడియా యాజమాన్యం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని చెప్పవచ్చు. అయితే గతంలోలా ఇప్పుడు బలంగా మద్దతున్న మీడియా సపోర్టు ద్వారా అధికారంలోకి వచ్చే రోజులు పోయాయని, మైండ్‌గేమ్ ఆడితేనే అధికారం దక్కుతుందనే విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాయి.

ప్రత్తిపాటి పుల్లారావుపై ప్రచారమే ఒక ఉదాహరణ!
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఐప్యాక్ సంస్థను నియమించుకొని సోషల్ మీడియాద్వారా తీవ్రస్థాయిలో మైండ్‌గేమ్ ఆడుతోంది. అధికారంలో ఉన్నప్పుడే వారి ప్రచారాన్ని పట్టించుకోకుండా అలసత్వం వహించడంతో ఈరోజు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ గేమ్‌ను తట్టుకోవడంలో తమ పార్టీ వెనకబడిపోతోందని, ఏది నిజమైన వార్తో.. ఏది నిజం కాదో అర్థంకాని అయోమయ స్థితిలోకి నెడుతున్నారని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా ప్రత్తిపాటి పుల్లారావు సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలవబోతున్నారని, పార్టీలో చేరబోతున్నారంటూ ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన ప్రచారాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

మైండ్ గేమ్ ఆడాలి..
ఆ ప్రచారాన్ని ఆసరాగా చేసుకొని ఇతర ఛానెల్స్ కూడా వార్తలు వేశాయి. ప్రత్తిపాటి పుల్లారావు ఆ వార్త వచ్చే సమయానికిపేట నియోజకవర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఉన్నారు. ఈ తరహా మైండ్ గేమ్ ఆడితేనే అధికారం దక్కుతుంది. ప్రజలను అయోమయంలోకి నెట్టేయాలి. వారు ఒక వార్తను వాస్తవం అనుకునేలోగా దానికి బలం చేకూరేలా మరో వార్తను పంపించగలగాలి. ఈ తరహా వ్యూహాలను అవలంబించే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అపర చాణక్యుడంటే బాబేగా?
ఎందుకంటే రాజకీయంలో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఎందుకు ఈ తరహా వ్యూహాలను ఎదుర్కొనలేకపోతున్నారు? ఆయనకు సమర్ధత లేదా? ఆయన దగ్గర వ్యూహాలు లేవా? ఆయన దగ్గర ప్రణాళికలు లేవా? అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలని కోరుతున్నారు. పాతకాలపు సిద్ధాంతాలను పట్టుకొని విలువలు, నిజాయితీ అంటూ మాట్లాడితే ప్రయోజనమేమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. పార్టీ శ్రేణుల ఒత్తిడిమీద వారు కోరుతున్నట్లు చేయాలన్నా పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలను మార్చాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూద్దాం.!!












Click it and Unblock the Notifications