టీడీపీ, బీజేపీ పొత్తులో బిగ్ ట్విస్ట్ - ఢిల్లీకి చంద్రబాబు..!!
ఏపీ పొత్తుల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా టీడీపీ, బీజేపీతో పొత్తు దిశగా పవన్ కల్యాణ్ ప్రతిపాదన చేసారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. ఈ విషయం పైన బీజేపీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నేతలు..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయినట్లుగా సంకేతాలు వెలువడు తున్నాయి. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతోంది.
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు : ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముందస్తు నేపథ్యంలో జనసేనాని పవన్ వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. అటు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఇటు పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు.

జనసేనతో పొత్తు పైన సానుకూలంగా స్పందిస్తున్న బీజేపీ నేతలు టీడీపీతో మాత్రం అవకాశం లేదంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల తరువాత అమిత్ షా తో చంద్రబాబు భేటీ సమాచారం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
పొత్తుల ప్రతిపాదన వేళ : బీజేపీ తొమ్మిదేళ్ల పాలన ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 8న విశాఖకు హోం మంత్రి అమిత్ షా వచ్చేందుకు షెడ్యూల్ ఖరారైంది. తాజాగా ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటన తో ఉత్సవాలను కేంద్రం రద్దు చేసింది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుకు బీజేపీ సుముఖంగా లేదనే ప్రచారం సాగుతోంది.
ఈ సమయంలో అమిత్ షా తో ఢిల్లీలో చంద్రబాబు భేటీ సమయంలో రాజకీయాలు చర్చకు వస్తాయా..పొత్తుల పైన చంద్రబాబు ప్రతిపాదన చేస్తారా..అమిత్ షా స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ మొదలైంది. ఇప్పుడు జీ20 సన్నాహక సదస్సులో భాగంగా ఢిల్లీలో జరిగే సదస్సుకు చంద్రబాబు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే కేంద్రంలోని ముఖ్య నేతలతో సమావేశం ఉందని చెబుతున్నారు.

చంద్రబాబు చర్చిస్తారా : జీ20 సదస్సును కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా పలు విభాగాలు..అంశాల పైన సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో భాగంగానే ప్రధాని, హోం మంత్రితో ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని సమాచారం. గతంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నిర్వహణ సమయంలోనే ప్రధాని మోదీ - చంద్రబాబు మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి.
బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్న సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షా తో మాట్లాడే సందర్భంతో చంద్రబాబు రాజకీయంగా ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటారా లేదా అనేది చూడాలి. రేపు మధ్యాహ్నం చంద్రబాబు తిరిగి హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం ఒడిశా రైలు దుర్ఘటనతో ఈ టూర్..సమావేశం పైన సందిగ్ధత కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications