నేటి నుంచి చంద్రబాబు ప్రత్యేక యాగాలు- మూడురోజుల పాటు-అధికారమే లక్ష్యం !
ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం పావులు కదుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ్టి నుంచి ప్రత్యేక యాగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఈ ప్రత్యేక యాగాలు నిర్వహించబోతున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాగాల్లో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొనబోతున్నారు. ఈ మధ్యే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు.. ఈ ప్రత్యేక యాగాలు చేపడుతుండటం విశేషం.

గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ఉన్న నివాసంలో చంద్రబాబు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే యాగాలు, పూజల్లో పాల్గొంటారు. ఇందులో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొనే ఈ యాగాల కోసం ఉండవల్లి నివాసంలో భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలు, పూజల నేపథ్యంలో చంద్రబాబు ఈ మూడు రోజుల పాటు తన అపాయింట్ మెంట్లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు బెయిల్ పై బయటికి వచ్చాక వరుసగా ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఇందులో తిరుమల వెంకన్న, బెజవాడ కనకదుర్గమ్మ, గుణదల మేరీమాత ఆలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు. అలాగే తమిళనాడు వెళ్లి అక్కడి ఆలయాలను కూడా దర్శించుకుని వచ్చారు. ఇప్పుడు తన ఇంట్లోనే ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించబోతున్నారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలిచి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ కలిసి రాకపోయినా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్ధితులు కలిసి వస్తాయని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. త్వరలో అమరావతిలో భారీ సభ పెట్టి టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications