కీలక నియోజకవర్గంలో అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు - జనసేన ఆశలపై..!!
తూర్పు గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గంలో చంద్రబాబు తమ పార్టీ అభ్యర్ధిని ప్రకటించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. జిల్లాల పర్యటనల్లో ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తూనే.. అటు పార్టీ పరిస్థితి పైన ఫోకస్ పెట్టారు. జనసేన తో టీడీపీ పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ చంద్రబాబు ఆసక్తి కర ప్రకటనలు చేస్తున్నారు. అధికారం దక్కాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో దక్కే సీట్లు కీలకం కానున్నాయి. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధిని ప్రకటించారు. అయితే, ఈ సీటు పైన జనసేన కూడా ఆశలు పెట్టుకుంది. దీంతో..ఇప్పుడు చంద్రబాబు ప్రకటనతో జిల్లాలో కొత్త చర్చ మొదలైంది.

పెద్దాపురం అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు
తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు జగ్గంపేట..పెద్దాపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. స్థానికంగా రైతులతో మమేకం అయ్యారు. పార్టీ నేతలతోనూ సమావేశం అయ్యారు. పెద్దాపురం పర్యటన సమయంలో మరోసారి పార్టీ నేత చినరాజప్పకే సీటు ఇస్తున్నానని..మూడో సారి ఆయన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పెద్దాపురం నియోజకవర్గంలో 2014,2019 ఎన్నికల్లో వరుసగా ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విజయం సాధించారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తోట నర్సింహం సతీమణి వాణి ఇక్కడి నుంచి పోటీ చేసారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా.. చంద్రబాబు ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేసిన చినరాజప్పకు తిరిగి సీటు ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జనసేనతో పొత్తు ఖాయంగా భావిస్తున్న వేళ.. కీలకమైన తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమైన ఈ సీటు నుంచి పార్టీ అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

పెద్దాపురం పై జనసేన ఆశలు
వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తమ అభ్యర్ధిని నిలబెట్టాలని జనసేన భావిస్తోంది. టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు నుంచి పోటీ చేయాలని నేతలు భావించారు. 2009 లో ఇక్కడి నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధి పంతం గాంధీ మొహన్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బొడ్డు భాస్కర రావు పైన పీఆర్పీ అభ్యర్ది గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక, 2019 ఎన్నికల్లో చినరాజప్పకు 67,393 ఓట్లు రాగా, వైసీపీ నుంచి పోటీ చేసిన తోట వాణికి 63,366 ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామికి 25,816 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా రెండు పార్టీలు కలిస్తే ఈ నియోజకవర్గంలో గెలుపు సులువుగా మారుతుందని జనసేన నేతలు భావించారు. అందులో భాగంగా తూర్పు గోదావరి లో కీలకమైన ఈ నియోజకవర్గం నుంచి తమ పార్టీ పోటీ చేయాలని జిల్లా నేతలు ప్రతిపాదించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రకటనతో టీడీపీ పోటీ ఖాయంగా మారింది.

సిట్టింగ్ లు అందరికీ టీడీపీ సీట్లు..
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వారికి తిరిగి సీట్లు కేటాయిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీకి దగ్గరైన వారి నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. జిల్లాల పర్యటన సమయంలోనూ మరి కొందరి అభ్యర్ధిత్వాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తూర్పు గోదావరి నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. జనసేనతో పొత్తు ఖాయమవుతున్న వేళ ఉభయ గోదావరి జిల్లాలు రెండు పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఈ జిల్లాల్లోని సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధానంగా నమ్మకం పెట్టుకుంటున్న సమీకరణాలకు కౌంటర్ గా వైసీపీ కొత్త స్కెచ్ సిద్దం చేస్తోంది. దీంతో..ఇప్పుడు పెద్దాపురం పైన జనసేన నుంచి ప్రతిపాదన వస్తే చంద్రబాబు నిర్ణయం మార్చుకుంటారా..లేక టీడీపీ అభ్యర్ధిగా చినరాజప్ప బరిలో నిలుస్తారనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications