మీకు ఇంకా కోపం రావట్లేదా - చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తమది ప్రజాబలమని..జగన్ ది ధనబలమని చెప్పుకొచ్చారు. ప్రజాబలం ముందు ధన బలం నిలబడదు ఈసారి అదే జరగబోతోందని చెప్పుకొచ్చారు.
రాష్ట్రానికి టీడీపీ పాలన అవసరమని పదే పదే ప్రస్తావించారు. రాష్ట్రం అవినీతిలో మునిగితేలుతుందన్నారు. అప్పుల కుప్ప అయిందని ఆరోపించారు. వీటి నుంచి బయట పడాలని పేర్కొన్నారు. ఇంత జరగుతున్నా మీకు కోపం రావటం లేదా అంటూ చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఒక్క అవకాశం అన్నారు: ఒక్క అవకాశం అనగానే మోసపోయి ఇప్పుడు ప్రజలు బాధ పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నూజివీడులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రభుత్వ పాలన పైన విమర్శలు గుప్పించారు. ఇసుక సామాన్యుడిగా భారంగా మారిందన్నారు. ఎమ్మెల్యేలు మాత్రం దందా చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు నినదించారు. ఇదే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వైసీపీ నమ్ముకొని ఆ పార్టీ నేతలే నష్టపోయారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తెలంగాణ నేతల వ్యాఖ్యలపై: చంద్రబాబు తన ప్రసంగంలో తాజాగా తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఏపీలో ఏముంది..కనీసం రోడ్లు కూడా లేవని తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు గుర్తు చేసారు. వారు అలా అనే పరిస్థితి రావటం బాధ కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. విశాఖ రామానాయడు స్టూడియో భూములు కొట్టేశారని ఆరోపించారు.
తిరుపతి పింక్ డైమండ్ తాను కాజేశానని అన్నారని..అధికారంలోకి వచ్చాక అసలు డైమండ్ లేదంటున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కొందరు పోలీసు అధికారుల తీరుతో శాఖ ప్రతిష్ఠ మసకబారుతోందన్నారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నీ సమక్షిస్తామని చెప్పుకొచ్చారు.
వైసీపీ ఎమ్మెల్యేపై ఫైర్: నూజివీడు ఎమ్మెల్యే పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అవినీతికి అంతు లేదన్నారు. ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు 300 ట్రక్కుల ఇసుకను దోపిడీ చేస్తున్నారు. 300 ఎకరాల అటవీ భూమిని ఎమ్మెల్యే కొడుకు కైంకర్యం చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. తోటపల్లి క్వారీలో దోపిడీకి పాల్పడ్డారన్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత వీరి పనిపడతామంటూ హెచ్చరించారు. నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే డిమాండ్‌ను ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సారి నూజి వీడులో గెలుపు అలవోకగా సాధిస్తామని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మూడు రోజుల క్రిష్టా జిల్లా పర్యటన ముగిసింది.












Click it and Unblock the Notifications