టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య - గుండ్లపాడుకు చంద్రబాబు : పార్టీ నేతల సీరియస్..!!
పల్నాడులో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు. మాచర్ల టీడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్యను నిన్న రాత్రి కొందరు దుండగులు కత్తులతో, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులోని చంద్రయ్య ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు యత్నించారు. అయితే, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.
బ్రహ్మారెడ్డి వచ్చే వరకూ తరలించవద్దని పోలీసులను కోరారు. దీంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యాహ్నం గుండ్లపాడుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రయ్య మృతదేహం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ ఘటన పైన నారా లోకేష్ స్పందించారు. హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందిని ఆయన ఆరోపించారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలని.. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామంలో వైసీపీ ఫ్యాక్షన్ మూకలు టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదే ఘటన పైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు.. రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది టీడీపీ కార్యకర్తలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications