అమరావతి సభ సక్సెస్-విపక్షాల పునరేకీకరణ-చంద్రబాబు కోరుకున్నట్లే-వైసీపీకి హెచ్చరికలు
తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన రాజధాని సభ ఏపీలో రాజకీయ పక్షాల పునరేకీకరణకు బాటలు వేసింది. ఏపీలో 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీపై విడివిడిగా పోరాటాలు చేస్తున్న విపక్షాలు.. అమరావతి అంశంపై మాత్రం ఏకతాటిపైకి వచ్చాయి. అంతకుమించి ఇదే కోరుకుంటున్న ప్రధాన విపక్ష నేత చంద్రబాబుకు ఈ సభ సంతోషాన్ని మిగిల్చింది. వైసీపీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్షం భవిష్యత్తులో ఏం చేయబోతోందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

అమరావతి సభ సక్సెస్
ఏపీలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని నెత్తికెత్తుకున్న వైసీపీ సర్కార్ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతున్న తరుణంలో.. ఇవాళ తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభ విపక్షాల ఐక్యతను చాటింది. అన్నింటికంటే ముఖ్యంగా గతంలో అమరావతికి మద్దతుగా అన్ని రాజకీయ పక్షాలు అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి గుర్తు చేశాయి. అలాగే వైసీపీ అమరావతిపై తీసుకున్న యూటర్న్ ను ప్రస్తావిస్తూ విపక్షాలన్నీ కార్నర్ చేశాయి. దీంతో అమరావతి రైతులతో పాటు టీడీపీ కోరుకుంటున్న ఫలితాన్ని ఈ సభ కచ్చితంగా అందించింది.

తొలిసారి ఏకమైన విపక్షం
ఏపీలో విపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు.. ఇప్పటివరకూ ఏ ఒక్క అంశంలోనూ కలిసి పోరాడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అమరావతి మినహాయిస్తే ఈ పార్టీలన్నీ మరే ఇతర అంశంలోనూ ఏకాభిప్రాయం కనబరచడం లేదు. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకుని అమరావతి రైతులు నిర్వహించిన ఈ సభలో విపక్షం సత్తా చాటుకుంది. ఏపీలో 2019కు ముందు కూడా ఇంత ఐక్యంగా విపక్షం ఎప్పుడూ లేదు. అప్పట్లో వైసీపీ కూడా విడివిడిగానే పోరాటాలు చేసేది. ఈ రెండున్నరేళ్లలోనూ విపక్షాలు ఇంత ఐక్యంగా ఎప్పుడూ కనిపించలేదు.

రాజకీయ పునరేకీకరణ
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో అధికార వైసీపీ విపక్ష పార్టీలన్నింటికీ కంటగింపుగా మారిపోయింది. అధికార, విపక్షాల మధ్య ఉండే సాధారణ శత్రుత్వాన్ని మించి వైసీపీ విపక్షాలను టార్గెట్ చేస్తుండటంతో అవన్నీ కచ్చితంగా ఏకం కావాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో తిరుపతి సభ వారందరికీ కలిసొచ్చింది. తిరుపతి సభలో విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావడంతో పాటు భవిష్యత్తులో పొత్తులు పెట్టుకునేందుకు తగిన వాతావరణం కూడా క్రియేట్ చేసుకున్నాయి. ఇఫ్పటికే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు కన్నాలక్మీనారాయణను తన పక్కనే పిలిచి నిలబెట్డడం వంటి దృశ్యాలు మరోసారి ఏపీలో రాజకీయ పునరేకీకరణకు అవకాశం కల్పించేలా ఉన్నాయి.

చంద్రబాబు ప్లాన్ సక్సెస్ ?
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తున్న చంద్రబాబుకు ఇప్పటివరకూ సీపీఐ మాత్రం తోడుండేది. జనసేన బీజేపీతో స్నేహం కారణంగా చంద్రబాబుకు బహిరంగంగా మద్దతు ప్రకటించే పరిస్దితి లేదు. బీజేపీ 2019 తర్వాత చంద్రబాబుకు పూర్తిగా దూరమైంది. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీకి వ్యతిరేకంగా వీరందరినీ ఒక గాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం తిరుపతి సభతో విజయవంతమైంది. ఇప్పుడు చంద్రబాబు కోరుకున్నట్లే వీరంతా అమరావతి రాజధాని విషయంలో జగన్ సర్కార్ పై పోరాటనికి సిద్ధమవుతున్నారు.

వైసీపీకి హెచ్చరికలు
తిరుపతి సభలో ఏపీలో విపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడం కచ్చితంగా అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టించే అంశమే. ఎందుకంటే ఇప్పటివరకూ బీజేపీ చంద్రబాబుతో కలిసేఅవకాశం లేదని భావిస్తూ వచ్చిన వైసీపీకి ఇప్పుడు తిరుపతి సభలో ఆ పరిస్ధితి లేదని అర్ధమైంది. అలాగే దాదాపుగా చంద్రబాబు ఆర్గనైజ్ చేసిన సభకు ఇతర విపక్షాలు కూడా కలిసిరావడంతో టీడీపీలో ఉత్సాహం ఉరకెత్తుతోంది. ఇదే అదనుగా విపక్షాలన్నీ కలిసి అమరావతి రాజధాని అంశాన్ని రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలుపెడితే కచ్చితంగా వైసీపికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.












Click it and Unblock the Notifications