''ఆ నలుగురు'' చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు రాజకీయం!
ఇప్పటికీ వీరు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించలేదు
AP అసెంబ్లీకి 2019లో జరిగి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లను దక్కించుకోగలిగింది. వైసీపీ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనప్పటికీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వానికి అనుబంధంగా కొనసాగుతున్నారు.

రాజీనామాలు చేయలేదు
ఇప్పటికీ వారు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించలేదు. రాజీనామా చేస్తే 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్యేలుగానే వారు ఇప్పటికీ వేతనాన్ని తీసుకుంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈనెల 23వ తేదీన జరగబోతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ అభ్యర్థి గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. వారంతా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే మండలిలో టీడీపీ తరఫున ఒక అభ్యర్థి అడుగుపెట్టడం ఖాయమవుతుంది.

విప్ జారీచేయాలని చూస్తున్న టీడీపీ
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగితే విప్ జారీ చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలు కూడా విప్ నకు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. విప్ ను ఉల్లంఘిస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. వైసీపీలో అసమ్మతి స్వరం వినిపించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలాంటివారు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గతంలో 23 మంది వచ్చారు
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మొత్తం వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీవైపునకు వచ్చారు. వారిలో కొందరు మంత్రి పదవులు కూడా చేపట్టారు. ఆ సమయంలో వారిపై ఎటువంటి చర్య చేపట్టలేదు. వారిలో ఒకరు మినహా మిగిలినవారంతా గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అలాగే ఈ నలుగురిపై కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. వారంతా వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అభ్యర్థిని నిలబెట్టాలని టీడీపీ నిర్ణయిస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తర మలుపులు తిరగనున్నాయి.












Click it and Unblock the Notifications