జగన్ ఇలా చేస్తే ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? ఏడాదికి 750 రోజులు పెంచాలేమో: సీఎంపై చంద్రబాబు ఫైర్
ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని, ఆ మోడల్ ను అనుసరించిన సౌతాఫ్రికానే ఇప్పుడు తలబాదుకుంటున్నదని, దీనిపై జాతీయ మీడియా ఏకిపారేసిన తర్వాత కూడా సీఎం జగన్ లో మార్పు రావడంలేదని టీడీపీ చీఫ్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది టీడీపీ సిద్ధాంతమన్న ఆయన.. అమరావతి పరిరక్షణ రాష్ట్రప్రజలందరి బాధ్యత అని, రాజధాని రైతుల ఉద్యమాన్ని ప్రజాఉద్యమంగా మలుస్తామని తెలిపారు.

కులాలపై కక్షతో..
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానులు, పీపీఏల రద్దు, పరిపాలన తీరులో జగన్ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. కులాలపై కక్ష పెంచుకుని ప్రజారాజధాని అమరావతిని నాశనం చేయొద్దంటూ.. తమవంతు బాధ్యతగా జాతీయ మీడియా సైతం కథనాలు రాసిందని, మూడు రాజధానుల నిర్ణయం తప్పని అన్ని కోణాల్లోనూ ఏకిపారేసిన తర్వాత కూడా జగన్ కు బుద్ధిరావడంలేదని విమర్శించారు.

ప్రజాప్రతినిధుల పరిస్థితేంటి?
అభివృద్ధిని వికేంద్రీకరించాలేగానీ పరిపాలనను కాదన్న సంగతి సీఎం జగన్ కు అర్థం కావడంలేదని, రాజధానులు మూడు చోట్ల ఉంటే ప్రజాప్రతినిధులు ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో అర్థంకాని పరిస్థితి తలెత్తుతుందని, మూడు రాజధానుల చుట్టూ తిరగాలంటే ఏడాదికి 750 రోజులు పెంచాల్సి ఉంటుందని, అధికారులు కూడా సరిగా పనిచేయబోరని చంద్రబాబు అన్నారు.

మాకెందుకులే అనుకోవద్దు..
రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవనో, ఇంకేదో కారణంతో అమరావతి గురించి మనకెందుకులే అని ప్రజలు అనుకోవద్దని, ప్రజా రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. ‘‘అమరావతి ముమ్మాటికే ప్రజారాజధానే. కొన్ని కులాలకో, కొన్ని వర్గాలకో చెందిన ప్రాంతం కాదిది. రైతుల పోరాటాన్ని ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళదాం''అని పిలుపునిచ్చారు. ఉద్యోగాల్ని స్థానికులకే కేటాయిస్తామన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు.

భయపడిపోతున్నారు..
జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిందని, విశాఖపట్నం నుంచి రాయలసీమ దాకా పెట్టుబడులు పెట్టాలనుకున్న కంపెనీలన్నీ భయపడి పారిపోతున్నాయని, తద్వారా రాష్ట్రానికి కోట్ల రూపాయల నష్టంతోపాటు లక్షలాది ఉద్యోగావకాశాలు కూడా చేజారీపోయాయని చంద్రబాబు ఆరోపించారు. పీపీఏల రద్దు, ప్రాజెక్టుల రీటెండరింగ్ లాంటి పనికిమాలిన విధానాలతో జగన్ పిచ్చితుగ్లక్ ను తలపించేలా పరిపాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications