పోలింగ్ ఎఫెక్ట్: నారా లోకేష్ ప్రచారం చేసినా..: రంగంలో చంద్రబాబు: కుప్పం ప్రయాణం
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరోసారి తన సొంత నియోజకవర్గానికి ప్రయాణం కట్టారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయన కుప్పానికి వెళ్లనున్నారు. మూడు వారాల వ్యవధిలో ఆయన కుప్పానికి వెళ్లడం ఇది రెండోసారి. ఇంత తక్కువ వ్యవధిలోనే తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతోండటం అసాధారణ చర్యగా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మినహా ఆయన ఎప్పుడూ కుప్పానికి వెళ్లలేదని, ఈ సారి మాత్రం ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో- ఆయనే రంగంలోకి దిగారని అంటున్నారు.

బెంగళూరు మీదుగా..
కాస్సేపట్లో ఆయన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకుంటారు. పోలింగ్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారు. 24 వార్డులు ఉన్న కుప్పం మున్సిపాలిటీ పోలింగ్ సరళి.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉందంటూ వార్తలు అందుతున్నందు వల్లే చంద్రబాబుు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. చంద్రబాబే స్వయంగా కుప్పంలో మకాం వేయడం వల్ల కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

నారా లోకేష్ ప్రచారం చేసినా..
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఇటీవలే కుప్పంలో పర్యటించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. అయినప్పటికీ- పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నారా లోకేష్ ప్రచారం చేసినా.. పార్టీపై ఉన్న వ్యతిరేకత తొలగిపోలేదని, దాని ప్రభావం పోలింగ్‌పై పడిందని చెబుతున్నాయి. అందుకే చంద్రబాబే రంగంలోకి దిగారని స్పష్టం చేస్తోన్నాయి.

కుప్పం మున్సిపాలిటీని కోల్పోతే..
తెలుగుదేశం పార్టీకి.. ప్రత్యేకించి- చంద్రబాబు నాయుడికి కంచుకోట కుప్పం నియోజకవర్గం. ఏడుసార్లు ఆయన ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 నుంచి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. నాటి ఎన్నికల్లో తొలి రెండు రౌండ్లల్లో ఆయన వెనుకంజ వేశారు. ఆ తరువాత జరిగిన గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది టీడీపీ. కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ పరిస్థితుల్లో మున్సిపాలిటీలో కూడా ఓటమి ఎదురైతే.. ఇక పార్టీ నామరూపాల్లేకుండా పోతుందనే ఆందోళన చంద్రబాబులో నెలకొని ఉంది.

24 వార్డుల కోసం..
చంద్రబాబు సొంత నియోజకవర్గం అయినప్పటికీ.. ఏడుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయాన్ని సాధించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది టీడీపీ. కుప్పం మున్సిపల్ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీలో దిగారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. వైఎస్ఆర్సీపీ అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులను నిలిపింది. పోటాపోటీగా ప్రచారాన్ని సాగించింది.

పెద్దిరెడ్డి స్వయంగా..
వైఎస్ఆర్సీపీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రచార బాధ్యతలను పర్యవేక్షించారు. ముమ్మరంగా ప్రచారం సాగించారు. సాధారణ కార్యకర్తలను ఆయన అభ్యర్థులుగా నిలిపారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ఓటర్లకు వివరించారు. చిత్తూరు జిల్లాలో ఆయనకు ఉన్న పలుకుబడి సైతం కుప్పం మున్సిపల్ పోలింగ్‌పై వైసీపీకి సానుకూల పరిస్థితులను కల్పించినట్టయిందని అంటున్నారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.
Recommended Video

600 మంది పోలీసులతో బందోబస్తు..
కుప్పం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. 600 మంది పోలీసులను మోహరింపజేశారు. మొత్తం 48 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 57 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 230 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బుధవారం ఓట్ల లెక్కింపు ఉంటుంది. కుప్పంతో పాటు అన్ని మున్సిపాలిటీలకు నిర్వహిస్తోన్న పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపును అదే రోజు చేపడతారు.












Click it and Unblock the Notifications