రాజంపేట టీడీపీ అభ్యర్ధిగా గంటా - టార్గెట్ పెద్దిరెడ్డి : వ్యూహం సక్సెస్ అయ్యేనా..!!
రాజంపేట : సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా రెండేళ్ల సమయం ఉంది. రానున్న ఎన్నికలు వైసీపీ ..టీడీపీకి ప్రతిష్ఠాత్మంగా మారుతున్నాయి. సీఎం జగన్ - ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠకు సవాల్ గా నిలుస్తున్నాయి. దీంతో.. నియోజవకర్గాల వారీగా సర్వేలు చేయిస్తున్న ఇద్దరు నేతలు... ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశం పైన నిర్ణయాలు మొదలు పెట్టారు. వైసీపీకి కంచుకోటగా నిలిచిన రాజంపేట లోక్ సభ సీటు పైన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు టార్గెట్ పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లాలో తనకు ప్రధాన ప్రత్యర్ధిగా మారిన పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిధున్ రెడ్డి లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరిని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
బెంగుళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నరహరి తన వ్యాపార కార్యకలాపాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకొన్నారు. దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు నరహరి సమీప బంధువు. సత్యప్రభ సోదరికి నరహరి అల్లుడు అవుతారు. రాజంపేటలోక్ సభ స్థానం నుంచి ప్రస్తుతం టీడీపీకి బలమైన అభ్యర్ధి అవసరం.

గంటా వర్సెస్ మిథున్ రెడ్డి
దీంతో..ఆర్దికంగా - స్థానికంగా బలమైన అభ్యర్ధి..కోసం టీడీపీ వెయిట్ చేస్తోంది. ఎలాగైనా అటు పుంగనూరు..ఇటు రాజంపేట లోక్ సభ స్థానాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- మిధున్ రెడ్డి పైన బలమైన అభ్యర్ధులను నిలబెట్టాలనేది చంద్రబాబు ఆలోచన. అందులో భాగంగా రాజంపేట ఎంపీగా గంటా నరహరి పోటీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా ఆయనే పేరే ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. రాజంపేట లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా టీడీపీ నేతలు సైతం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీ కోసం ఒక కార్యకర్త మాదిరిగా పనిచేస్తానని గంటా నరహరి చెబుతున్నారు. అయితే, 2024 ఎన్నికల్లో మిధున్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలనే అలోచన కూడా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో..మిధున్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తే..ఆ స్థానంలో వైసీపీ ఎవరిని ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దించుతుందనేది ఆసక్తి కర ఎంపికగా మారనుంది.

ఎవరికి కలిసొచ్చేను
ఇప్పటికే మూడు పేర్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అందులో మేడా ఫ్యామిలీతో పాటుగా..బెంగుళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త పేరు సైతం వినిపిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్ధి మిథున్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొందారు.
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి సత్యప్రభ పోటీ చేసారు. కానీ, సీఎం జగన్ మాత్రం ఢిల్లీలో పార్టీకి ప్రాధాన్యత..సంప్రదింపుల కోసం మిధున్ రెడ్డినే ఎంపీగా పంపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మిధున్ రెడ్డి వైసీపీ లోక్ సభా పక్ష నేతగా ఉన్నారు. దీంతో..ఇప్పుడు గంటా నరహరి టీడీపీ నుంచి బరిలో నిలిస్తే.. గంటా వర్సెస్ పెద్దిరెడ్డి పోటీ ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications