దూషణల వీడియోలు బయట పెట్టండి - నిందారోపణలు చేసారు : స్పీకర్ కు టీడీపీ లేఖ..!!
ఏపీ శాసనసభలో ఈ నెల 19న చోటు చేసుకున్న పరిణామాల పైన ఆడియో..వీడియోలను బయట పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. 19న జరిగిన చర్చకు సంబంధించిన ఆడియో, వీడియోలను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రజల ముందు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పీకర్ కు లేఖ రాసారు. ఆ రోజు జరిగిన వ్యవహారాలను సభాపతిగా మీకున్న విచక్షణాధికారులను ఉపయోగించి, రికార్డు .
అయిన అన్ని విషయాలను ప్రజాక్షేత్రంలో ప్రవేశపెట్టి, స్పీకర్ స్థానానికి ఉండే గౌరవాన్ని కాపాడాల్సిందిగా కోరారు.

స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా
గత రెండున్నరేళ్లుగా వ్యక్తిగత ధూషణలు, విమర్శలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. తాజాగా నిండు సభలో ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా అధికార పార్టీ శాసససభ్యులు, మంత్రులు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నెల 19న శాసనసభ లో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన చర్చలు, వాదోపవాదాలు రాష్ట్ర ప్రజానీకం మొత్తం ప్రత్యక్షంగా వీక్షించారని లేఖలో పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై చర్చిస్తే, ప్రభుత్వ అసమర్ధత బయటపడుతుందన్న భయంతో అధికార పార్టీ నేతలపై వ్యక్తిగత ధూషణలకు దిగారని విమర్శించారు.

ఎటువంటి తొలగింపుల్లేకుండా బయటపెట్టాలని
ఈ దూషణల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు పట్ల, అధికార పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు విస్తుపోయేలా చేసిందని చెప్పారు. భువనేశ్వరిపై పాలకపక్ష సభ్యులు చేసిన నిందారోపణలు మహిళల మనోభావాలను తీవ్రంగా కించపర్చినట్లుగా ఉన్నాయని వివరించారు. దీనికి సంబంధించి ఆడియో, వీడియోలను ఎటువంటి తొలగింపుల్లేకుండా బయటపెట్టాలని లేఖలో కోరారు. అయితే, మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ వాదనను పూర్తిగా ఖండిస్తున్నారు. అసలు సభలో భువనేశ్వరి పేరు ప్రస్తావనకే రాలేదని చెబుతున్నారు.

ఆ పేరే ఎత్తలేదంటున్న మంత్రులు
మంత్రులు కన్నబాబు.. పేర్నినాని .. బాలినేని శ్రీనివాస రెడ్డి సభలో చంద్రబాబు ప్రస్తావనకు రాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కుప్పంలో ఓడిన తరువాత ఫ్రెస్టేషన్ లో ఉన్న చంద్రబాబు సానుభూతి కోసం చేస్తున్న డ్రామాగా అభివర్ణించారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు తాను ప్రజాక్షేత్రంలో తేల్చుకున్న తరువాతనే సభలోకి అడుగు పెడతానంటూ శపధం చేసారు. టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు సైతం ఈ విడత సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.
Recommended Video

స్పీకర్ స్పందిస్తారా..వీడియో ఇస్తారా
దీంతో..ఇప్పుడు సభ ద్వారా ప్రభుత్వం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన స్పందిస్తారా.. లేక, అసలు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు సభలో బీసీ కులగణన పైన తీర్మానం చేయనున్నారు. దీంతో పాటుగా బీసీ..ఎస్సీ..ఎస్టీ వర్గాల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురంచి అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే రాసిన లేఖ పైన స్పీకర్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications