జగన్ వల్లే అన్నదాతల ఆత్మహత్యలు: దేశంలోనే థర్డ్ ప్లేస్‌లో: రైతు లేని రోజు కోసం కృషి
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకున్నారు. ఘాటు విమర్శలను గుప్పించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడానికి వైఎస్ జగన్ కారణమౌతున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ.. దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని, దీనికి జగన్ సర్కార్ తీసుకుంటోన్న రైతాంగ వ్యతిరేక నిర్ణయాలే కారణమని ఆరోపించారు.
బుధవారం ఆయన వరుస ట్వీట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దాడి చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతును రాజుగా చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత.. రైతే లేని రోజు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వివిధ పథకాల ద్వారా ఒక్కో రైతుకు సంవత్సరానికి లక్ష రూపాయిల లబ్దిని కలిగిస్తామని చెప్పారని, చివరికి వారు ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రభుత్వం ప్రేరేపిస్తోందని విమర్శించారు.

రైతులు దుక్కి దున్నడానికి అవసరమైన వ్యవసాయ సామాగ్రి, విత్తనాలు అందక అల్లాడుతున్నారని ఆరోపించారు. ఆఖరికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఇచ్చిన ప్రతీ హామీలోనూ వైఎస్ జగన్ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియను ఆయన మొదలుపెట్టారని ఆరోపించారు. 15 నెలల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగిపోయాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఏపీ ఉందని, పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications