2023లో జగన్ ప్రభుత్వం ఖతం : జనసేనతో పొత్తు-చంద్రబాబుకు అభిమానం: టీడీపీ నేత సంచలనం..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల పైన అప్పుడే పార్టీల నుంచి సందడి మొదలైంది. కొద్ది రోజుల క్రితం వరకు ప్రతిపక్ష నేత..టీడీపీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలు ఖాయమని...అందరూ సిద్దం కావాలని పార్టీ నేతలతో చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా పార్టీలోని ముఖ్యనేతలు కొత్త జోస్యాలు మొదలు పెట్టారు. 2023 నాటికే ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంద ని చెబుతున్నారు. అయితే, ఇది రాజకీయంగా మైండ్ గేమ్ లో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలా.. లేక, ఏంటి వారి అంచనాలు అనే అంశం పైన చర్చలు మొదలయ్యాయి.

టీడీపీ - జనసేన పొత్తుపై ప్రచారం
ఇదే సమయంలో కొద్ది రోజులుగా ఏపీలో జనసేన -టీడీపీ పొత్తు పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా గోదావరి జిల్లాలో స్థానికంగా ఉన్న టీడీపీ- జనసేన నేతలు పరస్పర అవగాహనతో పోటీ చేసారు. జెడ్పీటీసీ..ఎంపీటీసీలను పంచుకున్నారు. దీంతో..మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ... గొల్లపల్లి సూర్యారావు లాంటి నేతలు జనసేన - టీడీపీ అధికారికంగా పొత్తు పెట్టుకోవాలని సూచించారు. దీని పైన చంద్రబాబు - వపన్ కలవాలని కోరారు.

చంద్రబాబు - పవన్ ఆలోచించాలంటూ
ఇక, తాజాగా మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలు మార్చుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తామంటూ సవాల్ చేసారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కొత్త పొత్తులు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. ఇక, పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య కొంత కాలంగా సాగుతున్న మాటల యుద్దంలో పవన్ కు మద్దతుగా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ సైతం అదే తరహాలో స్పందించారు.

మరోసారి 2014 పొత్తులు రిపీట్
ఆదర్శం కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటామని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో అందరూ శత్రువులుగా ఉండకూడదని.. మిత్రులుగా ఉండాలని అభిప్రాయపడ్డారదు. ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలలకోసారి ప్రతిపక్షాల పైన మంత్రులతో పనికి మాలిన వ్యాఖ్యలు చేయిస్తూ ఉంటారని ఆరోపించారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారన్నారు. దీని వెనుక సీఎం జగన్ హస్తం ఉందని దుయ్యబట్టారు.

2023 లోనే జగన్ ప్రభుత్వం కూలిపోతుందంటూ
పవన్ క్రమశిక్షణ కలిగిలిన వ్యక్తి అంటూ ప్రశంసించారు. పవన్ తో కలిసి 2014లోనే పని చేసామని.. పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబుకు ప్రత్యేక అభిమానమని చెప్పుకొచ్చారు. 2024లో అవసరమైతే కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేసారు. 2023 లోనే జగన్ ప్రభుత్వం కూలిపోతుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో రాజకీయ చర్చ మొదలైంది. అటు పవన్ కల్యాణ్ ..ఇటు టీడీపీ నేతలు వరుసగా జగన్ ప్రభుత్వం లక్ష్యంగా చేస్తున్న విమర్శలు.. వచ్చే ఎన్నికల గురించి చేస్తున్న విమర్శలతో రానున్న ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయనే అంచనాలు బల పడుతున్నాయి.

బద్వేలు ఉప ఎన్నిక తరువాత కీలక మార్పులు
బద్వేలు ఉప ఎన్నిక తరువాత ఏపీలో కీలక రాజకీయ సమీకరణాలకు అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో కొనసాగుతోంది. టీడీపీ కి మద్దతుగా వామపక్షాల నేతలు నిలుస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, టీడీపీ నేతలు మాత్రం ముందు నుంచి జనసేనతో పొత్తు కోరుకుంటున్నారు. అదే సమయంలో జనసేనలోని పలువురు నేతలు సైతం బీజేపీ కంటే టీడీపీతో కలిస్తేనే మేలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో..రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయంగా ఎటువంటి పిరణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications