పొత్తులపై టీడీపీ నయా స్ట్రాటజీ, కీలక నిర్ణయం - సీఎం జగన్ ఎఫెక్ట్ ..!!
ఇటు మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. అటు సీఎం జగన్ ఢిల్లీ వేదికగా కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. పొత్తుల పైన చంద్రబాబు క్లారిటీ ఇచ్చే వేళ.. అటు హస్తినలో సీఎం జగన్ పొత్తుల ఎత్తులు చిత్తు చేసే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. మహానాడు వేదికగా పొత్తులపై క్లారిటీ ఇస్తారని భావిస్తున్న వేళ టీడీపీ ఆలోచనలో మార్పు వచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త సమీకరణాలు తెర పైకి వస్తున్నాయి.
పొత్తులపై స్పష్టత ఇస్తారా: రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికగా పొత్తులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మహానాడు వేదికగా ఎన్నికలకు సంబంధించి స్పష్టత ఆవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాజకీయ తీర్మానం కూడా సిద్దమైంది. ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తుపైన క్లారిటీ వచ్చింది. తమ రెండు పార్టీలతో కలిసి రావాలని పవన్ కల్యాణ్ బీజేపీ నాయకత్వానికి ప్రతిపాదన చేసారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే పొత్తులని స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో అనూహ్యంగా కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి అనుకూలం నిర్ణయాలు వెలువడ్డాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ రోజు నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు.
బీజేపీ - సీఎం జగన్ మైత్రి: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం జాతీయ రాజకీయాల్లో రచ్చగా మారింది. ప్రధాని పార్లమెంట్ ను ప్రారంభించటం పై నిరసనగా 20 ప్రతిపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. దీని పైన సీఎం జగన్ స్పందించారు. ప్రధాని నిర్ణయాన్ని ప్రశంసించారు. అన్ని పార్టీలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రధానికి మద్దతుగా జగన్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సీఎం జగన్ స్వయంగా పార్లమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఇటు మహానాడు లో పొత్తులపై చర్చ..టార్గెట్ జగన్ లక్ష్యంగా పావులు కదుపుతున్న సమయంలో అటు ఢిల్లీ వేదికగా జగన్ తన మంత్రాంగం ముమ్మరం చేసారు. బీజేపీ తమతో ఉందనే చెప్పే ప్రయత్నం చేసిన టీడీపీ, జనసేనకు ఢిల్లీ నుంచి క్లియర్ సంకేతాలు వెలువడుతున్నాయి.
పొత్తులపై కొత్త ఆలోచనలు: ఇప్పుడు మహానాడులో రాజకీయ నిర్ణయాలపై పార్టీ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం లక్ష్యంగానే రాజకీయ దాడి చేయాలని నిర్ణయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉనికి ఏపీలో నామమాత్రమే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ గురించి ప్రస్తావన చర్చలు..తీర్మానాల్లో అవసరం లేదని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పవన్ ప్రతిపాదించిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నిర్ణయానికి అనుకూలంగా తీర్మానం ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేన, బీజేపీతో పొత్తు పైనా నేరుగా స్పష్టత ఇచ్చే విషయంలోనూ మహానాడు వేదికగా ప్రకటన అవసరం లేదని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి కొంత సమయం తీసుకొని..బీజేపీ వైఖరిపై స్పష్టత వచ్చిన తరువాతనే ప్రకటన చేయాలని భావిస్తున్నారు. దీంతో..మహానాడులో చంద్రబాబు ప్రసంగం పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications