పొత్తు ముంచినా, తేల్చినా ఆ ఇద్దరిపైనే బాధ్యత..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన ఎన్నికల్లో కలిసి పోటీకి నిర్ణయించాయి. బీజేపీ తమతో కలిసి రావాలని కోరుకుంటున్నా సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. దీంతో, సీఎం జగన్ ను ఓడించటమే లక్ష్యంగా ఎన్నికల సమరానికి టీడీపీ..జనసేన సిద్దం అవుతున్నాయి. ఇందు కోసం రెండు పార్టీల నుంచి నేతలతో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. మొత్తం 12 మంది సభ్యుల తో ఈ సమన్వయ కమిటీ ప్రకటించనున్నారు.
మారుతున్న లెక్కలు: చంద్రబాబు అరెస్ట్.. పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటనతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. టీడీపీ బలహీనంగా ఉందనే అభిప్రాయం ఉందని..టీడీపీ, జనసేన కలిసి జగన్ ను ఎదుర్కోవాల్సి ఉందని పవన్ తాజాగా తన వారాహి యాత్ర సభలో పిలుపునిచ్చారు. రెండు పార్టల నేతలు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.

పార్టీ పరంగా అమలు చేయాల్సిన ఉమ్మడి కార్యాచరణ నిర్ణయించేందుకు రెండు పార్టీల నుంచి నేతలతో సమన్వయ సంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఈమేరకు నాయకత్వ బాధ్యతలను ఖరారు చేసారు. ఈ కమిటీ రెండు పార్టీల కార్యక్రమాలతో పాటుగా ఎన్నికల్లో సీట్ట వరకు అధినేతలకు తమ సూచనలు ఇవ్వనుంది.
సమన్వయ బాధ్యతలు: జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పేరు ప్రకటించారు. టీడీపీ నుంచి యనమల ఈ కమిటీకి నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మాజీ స్పీకర్లు..సీనియర్లు కావటంతో వీరికి రెండు పార్టీల అధినేతలు బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమయ్యారు. బీజేపీ నిర్ణయం ఎలా ఉన్నా..ముందు ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు సిద్దం కావాలని డిసైడ్ అయ్యారు.
జనసేన నుంచి మనోహర్ తో పాటుగా మహేందర్ రెడ్డి, కందుల దుర్గేష్, యశస్విని, గోవింద్, బొమ్మిడి నాయకర్ ను పవన్ నియమించారు. అదే విధంగా టీడీపీ నుంచి యనమలతో పాటుగా మరో అయిదుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అందులో మూడు రీజియన్ల నుంచి ముగ్గురు సీనియర్లతో పాటుగా ఒక మహిళా నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ కమిటీ ప్రకటిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

పొత్తుల్లో కీలకంగా: అటు చంద్రబాబు కేసులు సుప్రీం, ఏసీబీ కోర్టులో సోమవారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. కోర్టు తీర్పు తరువాత కార్యాచరణ ఖరారు చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు బయటకు వస్తే వెంటనే కలిసేందుకు పవన్ సిద్దంగా ఉన్నారని సమాచారం. అదే సమయంలో ఈ ఇద్దరు సీనియర్లకు సమన్వయ బాధ్యతలు అప్పగించటం ద్వారా పొత్తుల లెక్కల్లో సహజంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలుగుతారని భావిస్తున్నారు.
దీంతో, ఈ ఇద్దరి సీనియర్లు తీసుకొనే నిర్ణయాలు పొత్తులపైన ప్రభావం చూపున్నాయి. తుది నిర్ణయాలు చంద్రబాబు - పవన్ స్థాయిలో ఉండనున్నాయి. దీంతో, రేపు (సోమవారం) న్యాయస్థానల్లో పరిణామాల ఆధారంగా ఈ రెండు పార్టీల రాజకీయ కార్యాచరణ ఖరారయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications