5 వేల రోజులు.. 6904 కోట్లు.. జగన్ పై ఆనం పంచ్ లు..!
తెనాలి ఘటన బాధితుల్ని పరామర్శించి చంద్రబాబును కూడా కేసులుంటే కొడ్తారా అంటూ జగన్ వేసిన ప్రశ్నకు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును రోడ్డుపై కొట్టాలని జగన్ అంటున్నారని, ఆయనపై 24 కేసుల్లో 22 కేసులు మీరే పెట్టారని జగన్ కు వెంకట రమణారెడ్డి గుర్తుచేశారు. ఇందులో రెండే మామూలు కేసులని, మిగతావి కావాలని పెట్టిన కేసులే అన్నారు.
పేదలకు ఉచిత ఇసుక ఇచ్చినందుకు చంద్రబాబుపై ఓ కేసు పెట్టారని, పుంగనూరులో చంద్రబాబు దాడి చేయించారని మరో కేసు పెట్టారన్నారు. బహిరంగసభలో జనాల్ని ఇబ్బందిపెట్టారని మరో కేసు పెట్టారన్నారు. మరో సభలో లౌడ్ స్పీకర్లు వాడారనేది మరో కేసన్నారు. కరోనాపై సోషల్ మిడియాలో అవగాహన చేసినందుకు ఇంకో కేసు పెట్టారన్నారు. ఇన్ని దొంగ కేసులు పెట్టి చంద్రబాబును తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లతో పోలుస్తున్నారని ఆక్షేపించారు.

వాళ్లంతా పిల్లకాయలంటున్నారని, ఇందులో ఒకరు కేజీ గంజాయితో దొరికారని, మరొకరు అమ్మాయిని రేప్ చేయబోయాడని, ఇంకొకడు ఆటో దొంగలించాడని, ఇలాంటి వారి కోసం జగన్ తెనాలి వెళ్లారన్నారు. జగన్ ఓడిపోయి ఏడాది అయ్యిందని, ఈలోపు మందులు తీసుకుని కోలుకోవచ్చు కదా అన్నారు. ఎవరిని ఎవరితో పోలుస్తున్నారో తెలియదా అని ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లు చంద్రబాబును రోడ్డుమీద ఈ కేసుల కోసం కొట్టాలంటే.. మిమ్మల్ని దేంతో కొట్టాలని ఆనం ప్రశ్నించారు.
జగన్ పై 31 కేసులున్నాయని, ఇందులో సీబీఐ కేసులు 11 అని, ఈడీ కేసులు 7 అని అన్నారు. ప్రపంచ రికార్డు స్ధాయిలో 3452 సార్లు జగన్ కోర్టు వాయిదాలు తీసుకున్నారని గుర్తుచేశారు. జగన్ హరీష్ సాల్వే, అభిషేక్ సంఘ్వీ, ముకుల్ రోహత్గీ వంటి లాయర్లను పెట్టుకుని జైల్లో నుంచి తప్పించుకుని వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. వీరికి గంటకు 12 నుంచి 25 లక్షలు ఫీజులు కట్టాలన్నారు.
6904 కోట్లు జగన్ లీగల్ ఫీజులకు ఖర్చుపెట్టారనేది తమ అంచనా అని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. జగన్ పై కేసులు నమోదై 5 వేల రోజులయిందన్నారు. ఈ రోజుకు కూడా జగన్ మీద కేసిన కేసుల్లో ఒక్క కేసు విచారణ కూడా జరగలేదన్నారు. డబ్బు అడ్డంపెట్టుకుని జైల్లో ఉండకుండా తప్పించుకుంటూ రోజుకు కోటీ 39 లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారన్నారు. నిద్ర లేవగానే జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఈ మొత్తం పక్కనబెట్టాలన్నారు. 5 వేల రోజుల తర్వాత సాక్షులు కూడా కొంతమంది చనిపోయారన్నారు. తప్పు చేయకపోతే ఇన్ని వాయిదాలు ఎందుకని ఆనం ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications