చెంగల్రాయుడు వ్యాఖ్యల చిచ్చు-పోలీసులసంఘం వార్నింగ్-విజయవాడ సీపీకి ఫిర్యాదు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాల్లో పోలీసులు మధ్యలో నలిగిపోతున్నారు. ఈ విషయం మరోసారి రుజువైంది. తాజాగా టీడీపీ రాష్ట్రస్దాయి భేటీలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసులు, జడ్డీలను ఉద్దేశించి చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం మండిపడుతోంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బత్యాల చెంగల్రాయుడు తాజాగా టీడీపీ రాష్ట్రస్దాయి భేటీలో మాట్లాడుతూ.. రైల్వేకోడూరుకు చెందిన పోలీసు నా కొడుకులు ఫోన్‌చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు వాయిస్ రికార్డు చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని బెదిరించాలని సలహా ఇచ్చారు. 'పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు అబద్ధాలు చెప్పండి. పోలీసులు ఎగిసెగిసి తన్నారని చెప్పాలి. చెప్పరాని చోటులో ఈ పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారు. చాలా నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలి. అప్పుడు నా కొడుకులకు ఖాకీ గుడ్డలు ఊడిపోతాయి' అంటూ కార్యకర్తలకు ఆయన సలహాలిచ్చారు. పోలీసులను ఎలా ఇబ్బంది పెట్టాలో, తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో ఆయన కార్యకర్తలకు శిక్షణ తరహాలో వివరించారు.దీంతో ఈ వ్యాఖ్యలు పోలీసులకు మంటపుట్టించాయి.

మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ మండిపడ్డారు. చెంగల రాయుడు పోలీస్ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.
చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా నిమ్మకుండిన చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. చెంగల్రాయుడిని చట్టసభలకు పంపిననందుకు చంద్రబాబు సిగ్గు పడాలన్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజ్యాంగ వ్యవస్థలపై ఈ వ్యాఖ్యలు సరికాదన్నారు. మేము కేవలం ప్రజలకు మాత్రమే కట్టు బానిసలం,
మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామన్నారు. చెంగల్రాయుడు లాంటి వెడవలను చట్ట సభలకు పంపొద్దని సూచించారు.
చెంగలరాయుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడని ఏపీ పోలీసు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురామ్ ప్రశ్నించారు. చెంగల్ రాయుడు భగవద్గీత, ఖురాన్, బైబిల్ పై ప్రమాణం న్యాయవాది పట్టా పుచ్చుకున్నది ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికా అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, చంద్రబాబు మౌనం వహించడం చెంగల్రాయుడు మాటలను సమర్ధించడమే అన్నారు. ఊడిపోవటానికి మా యూనిఫామ్ లు ఖద్దరు బట్టలు కాదన్నారు. 60ఏళ్ల వయసులో చెంగల్ రాయుడు హద్దు మీరి మాట్లాడారని, తక్షణమే చెంగల్రాయుడిపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు వారు ఇవాళ విజయవాడ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications