రాధాకు పవన్ షాక్ - టీడీపీ నేతకు జనసేన సీటు..!!
ఏపీ ఎన్నికల రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనకు పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు కేటాయించారు. జనసేనాని పవన్ ఇప్పటి వరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్దులను ప్రకటించారు. వంగవీటి రాధా జనసేన నుంచి పోటీ చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. సీటు పైన సంకేతాలు వెలువడ్డాయి. కానీ, ఇప్పుడు సీనియర్ టీడీపీ నేత జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి అదే స్థానం నుంచి పోటీకి రంగం సిద్దమైంది.
జనసేనలోకి టీడీపీ నేత
జనసేన కు కేటాయించిన స్థానంలో మరో టీడీపీ నేత పోటీ చేయనున్నారు. జనసేనకు కేటాయించిన స్థానాల్లో పాలకొండ, అవనిగడ్డ స్థానాలకు అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్దిగా బాలశౌరి పేరు పవన్ ప్రకటించారు. అవనిగడ్డ నుంచి వంగవీటి రాధా పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. ఎంపీ అభ్యర్దిగా ఖరారైన బాలశౌరితో ఈ మధ్య కాలంలోనే వంగవీటి రాధా భేటీ అయ్యారు. మనోహర్ తోనూ రాధా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దీంతో..జనసేనలో రాధా చేరటం ఖాయమని భావించారు. అదే విధంగా అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్దిగా రాధాతో పాటుగా ఇక్కుర్తి శ్రీనివాస్, మరో ఇద్దరు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

రాధా కు సీటు లేనట్లే
కానీ, ఇప్పుడు సీనియర్ టీడీపీ నేత జనసేన అభ్యర్దిగా అవనిగడ్డ నుంచి పోటీ చేయటం ఖాయమైంది. భీమవరంలో టీడీపీ నేత రామాంజనేయులును జనసేనలో చేర్చుకొని ఆ సీటు కేటాయించారు. ఇప్పుడు అదే తరహాలో అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ ఈ రోజు జనసేనలో చేరుతున్నారు. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్దిగా పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించిన సమయం నుంచి మండలి బుద్ధ ప్రసాద్ మద్దతు దారులు ఆందోళన చేస్తున్నారు. సీటు మండలి బుద్ధ ప్రసాద్‌కు కేటాయించకపోతే రాజకీయాలకు దూరం కావాలని ఆయన నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు అవనిగడ్డలో సర్వేల తరువాత మండలి బుద్ధ ప్రసాద్‌ను జనసేనలో చేర్చుకొని ఆ సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
జనసేన స్థానంలో టీడీపీ నేత
అదే విధంగా పెండింగ్ లో ఉన్న పాలకొండ స్థానం సైతం టీడీపీ నుంచి వచ్చిన నేతకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ జనసేన నుంచి పలువురు ఆశావాహులు ఉన్నారు. అయితే, నిమ్మక జయరాజ్ పేరు ఖాయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా టీడీపీలో సీటు దక్కని నేతలను జనసేనలో చేర్చి..అక్కడ సీట్లు దక్కేలా టీడీపీ వ్యూహం అమలు చేస్తోంది. అవనిగడ్డ నుంచి వంగవీటి రాధా పోటీ పైన జరిగిన ప్రచారానికి తాజా నిర్ణయంతో ఇక సాధ్యం కాదని తేలిపోయింది. ప్రస్తుతం టీడీపీలోనే రాధా కొనసాగుతున్నా..యాక్టివ్ గా లేరు. ఎన్నికల్లో రాధా ప్రచారం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఇప్పుడు కూటమి తరపున రాధా ప్రచారం చేస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications