Nara Lokesh : బీజేపీతో పొత్తుపై ముస్లింలకు క్లారిటీ ఇచ్చేసిన లోకేష్...!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పటికే రాష్ట్రంలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఎలాంటి పొత్తుల్లేకుండా ముందుకెళ్తామని వైసీపీ చెప్తుండగా.. విపక్షాలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయో తెలియని పరిస్దితి. దీనిపై వైసీపీ నిత్యం సెటైర్లు వేస్తూనే ఉంది. అయితే విపక్షాలు మాత్రం తమ పొత్తుల రాజకీయాన్ని సమర్ధించుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ జంకుతుండగా.. టీడీపీ, జనసేన మాత్రం సై అంటున్నాయి.
ఈ క్రమంలో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అన్న దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు ఈసారి టీడీపీకి మద్దతిస్తారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదే ప్రశ్న ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు కూడా ఎదురవుతోంది. తాజాగా ముస్లింలకు అనుబంధంగా కనిపించే దూదేకుల సామాజికవర్గం నేతలు అనంతపురం జిల్లాలో నారా లోకేష్ ను ఇదే అంశంపై ప్రశ్నించారు.

బీజేపీతో టీడీపీ ఈసారి పొత్తు పెట్టుకుంటుందా లేదా, పొత్తు పెట్టుకుంటే తాము ఓట్లు వేయాలా లేదా అనే ప్రశ్నల్ని దూదేకుల సామాజికవర్గం నేతలు నారా లోకేష్ కు సంధించారు. వీటిపై లోకేష్ కూడా అంతే ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వానికి తాము మద్దతిచ్చినా ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్న అంశాన్ని లోకేష్ గుర్తుచేశారు. ఈసారి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు.

గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వలేదా అని లోకేష్ ప్రశ్నించారు. అలాగే ముస్లింలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోలేదా అని అడిగారు. బీజేపీతో పొత్తున్న సమయంలోనే నాగుల్ మీరాను పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ చేసిన విషయాన్ని కూడా లోకేష్ గుర్తుచేశారు. కానీ వైసీపీ బీజేపీతో అంటకాగుతున్న సమయంలో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, మిస్బా అనే పదో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుందని లోకేష్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మాత్రం తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications