మా నాన్నది పెద్ద మనసు: నాతో అలా ఉండదు..నేను వదిలి పెట్టను: వైసీపీకి నారా లోకేష్ వార్నింగ్
గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి నారా భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో తన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నారా లోకేష్ హెచ్చరించారు.

స్థానికులను కలుసుకుంటూ..
ఈ ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. స్థానికులను కలుసుకున్నారు. వారితో మాట్లాడారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలను పలకరించారు. వారితో ఫొటోలు దిగారు. పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎక్కడ ఉన్నా వదిలి పెట్టం..
వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ ఉన్నా తాను వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పెద్దాయన వదిలేస్తాడని వైసీపీ నాయకులు అనుకున్నా..తాను ఆ పని చేయనని అన్నారు. తనతో ఆ పరిస్థితి ఉండదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి, సభతో సంబంధం లేని వారిపై విమర్శలు చేయడం సహేతుకం కాదని నారా లోకేష్ అన్నారు. తన తల్లిని కించపరిచిన వారిని, అవమానపరిచిన వారిని వదిలి పెట్టబోనని తేల్చి చెప్పారు.

చంద్రబాబు వదిలి పెట్టినా..
నిండు సభలో తన తల్లిని విమర్శించడం బాధ కలిగించిందని అన్నారు. తల్లిని కించపరిచిన వారిని చంద్రబాబు నాయుడు పెద్దాయన, పెద్ద మనసు చేసుకుని వదిలేస్తాడని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని, ఆయన వదిలి పెట్టినా.. తాను వదలబోనని హెచ్చరించారు. చంద్రబాబుది పెద్ద మనసు.. ఆయన వదిలిపెడతారని మీరు (వైసీపీ నాయకులు) అనుకోవచ్చు. నాతో మాత్రం అలా ఉండదు. ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. అని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.

తీవ్ర పరిణామాలు..
తమ కుటుంబాన్ని బయటకు లాగాలని వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. వచ్చే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని అన్నారు. వైసీపీ నాయకులు ఎక్కడ ఉన్నా వెంటాడుతామని చెప్పారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం నైతికత అనిపించుకోదని అన్నారు. తన తల్లిని అవమానించిన వారి గురించి అన్ని వివరాలను సేకరించామని చెప్పారు. వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు సైతం ఈ విషయంలో అతిగా స్పందించారని అన్నారు.
Recommended Video

అధికారంలోకి వచ్చేది మేమే
మహిళలు, కుటుంబ సభ్యులను కించపరిచేలా, అవమానాలకు గురిచేసేలా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారాన్ని కోల్పోతున్నామనే నిర్దారణకు వచ్చారని, అందువల్లే సహనం కోల్పోయి ఇలాంటి చవకబారు వ్యాఖ్యానాలు చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టబోమని అన్నారు.












Click it and Unblock the Notifications