గన్నవరం కోర్టుకు టీడీపీ నేత పట్టాభి- శరీరంపై గాయాలు-ముగ్గురు ముసుగేసి కొట్టారన్న భార్య
గన్నవరం టీడీపీ ఆఫీసు దహనం తర్వాత చోటు చేసుకున్న ఘటనల్లో అరెస్ట్ చేసిన పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని ఇవాళ పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.
గన్నవరంలో టీడీపీ ఆఫీసు దహనం ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. వైసీపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారన్న కారణంతో ఆ పార్టీ నేతలు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసకు కారణమయ్యారనే ఆరోపణలతో విజయవాడ టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి అదుపులోకి తీసుకున్న పట్టాభిని ఇవాళ మధ్యాహ్నానికి కానీ గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకురాలేదు.
మధ్యాహ్నం గన్నవరం పీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు.. అనంతరం సాయంత్రం స్ధానిక కోర్టులో ఆయన అరెస్టు చూపారు. గన్నవరంలో నిన్న చోటు చేసుకున్న హింసకు ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఎస్పీ జాషువా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు చేసి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గన్నవరం కోర్టులో హాజరుపర్చేందుకు పీఎస్ నుంచి తరలించే క్రమంలో పట్టాభి శరీరంపై గాయాలు కనిపించాయి. వాటిని పోలీసు వ్యాన్ లో నుంచే మీడియాకు ఆయన చూపించారు.

నిన్న సాయంత్రం పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు. ఆయన భార్య చందన ఎంత ప్రయత్నించినా ఫోన్ కూడా స్విచాఫ్ వచ్చింది. మీడియా ప్రతినిధులు అడిగినా పోలీసులు ఆయన ఆచూకీ వెల్లడించలేదు. చివరికి ఇవాళ కోర్టుకు గాయాలతో తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన భార్య చందన.. తన భర్తను బాగా హింసించారని ఆరోపించారు.పోలీసుల సహకారంతోనే ఇదంతా జరిగిందన్నారు. తోట్ల వల్లూరు పీఎస్‍లో తన భర్ పట్టాభిని ముసుగేసి ముగ్గురు కొట్టారని చందన ఆరోపించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని మొదటినుంచి చెప్తున్నట్లు ఆమె తెలిపారు. తన భర్త ఇంత ఆందోళనతో ఎప్పుడూ కనిపించలేదని చందన వెల్లడించారు.












Click it and Unblock the Notifications