Pithapuram: పవన్ గెలుపు అడ్డుకునేలా వైసీపీ ప్లాన్ ! బయటపెట్టిన వర్మ..!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలూ ఓ ఎత్తయితే పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలు మరో ఎత్తుగా మారాయి. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడమే. పిఠాపురం సీటును ఆశించిన టీడీపీ నేత.. చివరినిమిషంలో పవన్ ఎంట్రీతో వెనక్కి తగ్గారు. అంతే కాదు పవన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు కౌంటింగ్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న మరో కుట్రను ఆయన బయటపెట్టారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీతగా సాగిన పూరుపై ఇప్పటికే జనసేనాని గెలుపుపై బెట్టింగ్ కు కూడా సిధ్దమంటున్న టీడీపీ నేత వర్మ.. ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏదోరకంగా గొడవలు సృష్టించి,కౌంటింగ్ నిలుపుచేయాలనే దురాలోచనలతో వైసీపీ వ్యూహాలు పన్నుతోందని వర్మ ఇవాళ ఆరోపించారు. ఇందుకోసం వైసీపీ చేస్తున్న ప్లాన్ ను వర్మ వివరించారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీషీటర్లను,గూండాలను నియమిస్తోందంటూ వర్మ ఆరోపించారు.

ఏ పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లు అయినా సరే క్షుణ్ణంగా పరిశీలన చేయాలని ఎన్నికల అధికారులను, పోలీసులను మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. ఏజెంట్లుగా ఉండే వారు నేరచరిత్ర కలిగిన వారు కాకుండా చూడాలని వర్మ కోరారు. తద్వారా కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ విజయంపై ధీమాగా ఉన్న కూటమి పార్టీలు కౌంటింగ్ సందర్భంగా వైసీపీ నేతలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికల్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.












Click it and Unblock the Notifications