కరోనా సంక్షోభంలోనూ జగన్ బెయిల్ రద్దుపై దేశ వ్యాప్త చర్చ జరగాలన్న టీడీపీనేత వర్ల రామయ్య ... ఇదేమయ్యా !!
యావత్ దేశం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల విమర్శలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా,ఏ కార్యక్రమం చేపట్టినా, సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాద్ధాంతం మాత్రం షరా మామూలుగా మారిపోయింది.ఇక తాజాగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను సిబిఐ విచారణకు అర్హమైందిగా తీసుకోవడంతో జగన్ కు బెయిల్ ను రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని, అయన 7 వ తారీఖున సిబిఐ కోర్టుకు హాజరుకావాలనే ఆదేశాలపై దేశవ్యాప్త చర్చ జరగాలి. అధికారంలో వున్న నిందితుని అధికారం కోర్టుల విచారణకు అడ్డుకారాదు, దానికి ప్రాధాన్యత ఇచ్చి ముద్దాయిలపట్ల న్యాయస్థానాలు వివక్ష చూపించడం మంచిది కాదు. దేశవ్యాప్త చర్చ జరగాలి.
— Varla Ramaiah (@VarlaRamaiah) April 29, 2021

జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత వర్ల రామయ్య
ముఖ్యంగా టిడిపినేత వర్ల రామయ్య జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్నరఘురామకృష్ణంరాజు జగన్ పై వేసిన బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో రాజు గారూ మీరు మరీను ఇదా సమయం ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు చేయమని కోరడానికి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్ల రామయ్య ప్రస్తుత కరోనా పరిస్థితులలో జగన్ కరోనా కట్టడిపై దృష్టి పెడతారా లేక తన బెయిల్ రద్దు వ్యవహారంపై దృష్టి పెడతారా అంటూ సెటైర్లు వేశారు.

జగన్ బెయిల్ రద్దువ్యవహారంపై దేశ వ్యాప్త చర్చ జరగాలని ట్వీట్
తాజాగా మరోమారు సోషల్ మీడియా వేదికగా స్పందించిన వర్ల రామయ్య ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని,ఆయన ఏడవ తారీఖున సిబిఐ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న నిందితుని అధికారం కోర్టుల విచారణకు అడ్డు కారాదు అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు అధికారానికి ప్రాధాన్యత ఇచ్చి ముద్దాయిల పట్ల న్యాయస్థానాలు వివక్ష చూపించడం మంచిది కాదు,దీనిపై దేశవ్యాప్త చర్చ జరగాలి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు నిజంగానే చర్చనీయాంశంగా మారింది.

దేశం కరోనాతో తీవ్ర సంక్షోభంలో ఉంటే రాజకీయాలకు ఇదా సమయం ?
ఒక పక్క దేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడుతుంటే,దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొంటే, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే ఏం చేయాలన్న దానిపై జరగాల్సిన చర్చను పక్కన పెట్టి సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై దేశవ్యాప్త చర్చ జరగాలని వర్ల రామయ్య కోరడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి సమయంలోనా, ఇటువంటి అంశాలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సింది అంటూ ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. రాజకీయాలకు ఇదా సమయం అని అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications