చంద్రబాబు వర్సెస్ జగన్: టిడిపి నేతల్లో డైలామా, వైసిపి ఎమ్మెల్యేల పక్కచూపులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఐదుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతుండగా, పదవులు లేని తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక డైలమాలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు, నాయకులకు గాలం వేస్తుంటే, జగన్ వారిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, శాసనసభ్యులు తమ పార్టీలోకి వస్తే తమ భవిష్యత్తు ఏమిటనే అందోళనలో తెలుగుదేశం పార్టీ నాయకులు పడినట్లు చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఎటువంటి పదవులు లేకుండా ఉన్న మాజీమంత్రులు కెఈ ప్రభాకర్, శిల్పా మోహన్‌రెడ్డి, ఎన్.ఎమ్.డి. ఫరూక్, ఇరిగెల రాంపుల్లారెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి వంటి సీనియర్ పాటు జూనియర్ నేతలు కూడా డైలమాలో పడినట్లు చెబుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లాలో అసంతృప్తి సెగలు రగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
కాగా, కర్నూలు జిల్లాలో పటిష్టంగా ఉన్న తమ పార్టీని దెబ్బ తీసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే బయట జరిగే ప్రచారానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.

ఈ నెల 6వ తేదీన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చినప్పుడు రాత్రి పత్తికొండ ప్రభుత్వ అతిథిగృహంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో రహస్యభేటి జరిపారు. జిల్లా అభివృద్ధి- పార్టీ స్థితిగతులపై ప్రధానంగా చర్చించారు. టిడిపిలోకి వచ్చే నాయకులను ఆహ్వానించాలని, ఎవరికీ అన్యాయం జరగకుండా తాను చూసుకుంటానని చంద్రబాబు అన్నట్లు చెబుతున్నారు. దాంతో కర్నూలు రాజకీయం వేడెక్కింది.
జిల్లాలో టిడిపికి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి 14 స్థానాల్లో టిడిపి జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని నంద్యాల బహిరంగసభలో ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగా ఇతర పార్టీల నాయకులను టిడిపిలో చేర్చుకునేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications