ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు..!: చంద్రబాబు
పార్టీలో మాట వినేవారికన్నా వినని నాయకులే ఎక్కువగా ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు ఓర్పుగా పార్టీని నడిపిస్తున్నందుకు ప్ర్యత్యర్థులు కూడా హ్యాట్సాఫ్ చెబుతారు.
మీ పార్టీలో కొంతమంది నాయకులను ఓర్పుగా భరాయిస్తున్నారంటే చంద్రబాబును చెప్పుకోవచ్చంటూ ప్రత్యర్థి పార్టీల్లోని కొందరు నాయకులు తెలుగు తమ్ముళ్లవద్ద వ్యాఖ్యానిస్తుంటారు. పార్టీ అధికారంలో లేని సమయంలో మాట వినని నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. కొన్నాళ్ల నుంచి విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని అధినేత పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసినవారు ఎవరైనా.. అదే కేసీఆర్ దగ్గరో, జగన్ దగ్గరో అలా చేయమనండి అంటున్నారు.

పార్టీపై, అధినేతపై వివాదాస్పద వ్యాఖ్యలు
బొకే ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు పార్టీపై, అధినేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూస్తున్నదే. తాజాగా రాయపాటి సాంబశివరావు అయితే కడపోళ్లకు నరసరావుపేట టికెట్ ఇస్తే ఓడిస్తామని ప్రకటించారు. తమ కుటుంబంలో ఇద్దరికి సీటివ్వడంతోపాటు తాడికొండ సీటు కూడా తాను సూచించినవారికే ఇవ్వాలని హుకుం జారీచేశారు. పోనీ ఈయనేమన్నా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతా? అంటే కాదు.. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.

అన్నీ తెలిసినా మౌనం వహిస్తారు..
ఒకవైపు వల్లభనేని వంశీ, కొడాలి నాని చంద్రబాబుపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిందే. అటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ వారిద్దరితో అంటకాగే నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ విషయం చంద్రబాబునాయుడికి కూడా తెలుసు. కానీ ఏమీ మాట్లాడరు. ఒకవైపు పార్టీని నడిపించాలి.. ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచించాలి.. కానీ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు మాత్రం ఇతర పార్టీల నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుంటారు. వారెవరనేది చంద్రబాబుకు తెలుసు. కానీ మౌనంగా ఉంటారు. పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీలకు సమాచారం చేరవేసేవారి గురించి కూడా తెలుసు. కానీ ఆయన మాట్లాడరు.

మాట వినేవారికన్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువ?
పార్టీ ఓటమిపాలైన తర్వాత మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ కుమార్ అధినేతను విమర్శిస్తూ వైసీపీలోకి వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో సీట్ల కోసం కొట్లాటలు.. ఒకరిపై మరొకరు పదునైన విమర్శలు.. సీటివ్వకపోతే ఓడిస్తాననే హెచ్చరికలు.. ప్రజలతో మమేకమవని చెబుతున్నప్పటికీ అధినేత మాటలను పెడచెవిన పెట్టే నాయకులు... ఇలా ఒకటా.. రెండా.. విభిన్నరకాల మనస్తత్వాలు కలిగిన నాయకులతో నిండివున్న తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న చంద్రబాబుకు హ్యాట్సాఫ్ చెప్పవచ్చంటారు ఆయన సన్నిహితులు.












Click it and Unblock the Notifications