చంద్రబాబుపై రాళ్లేయించింది వాళ్లిద్దరే?
యర్రగొండపాలెంలో జరిగిన సంఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్, ఐప్యాక్ ఇద్దరూ కలిసి ఈ ప్రణాళిక వేశారని ఆరోపిస్తున్నారు. రూట్ మ్యాప్ తెలుసుకొని దాడిచేస్తుంటే పోలీసులేం చేస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సమావేశాల్లో ప్రతిపక్షాలు నిరసన తెలియజేయాలంటే పోలీసులు అనుమతిస్తారా? అంటూ నిలదీశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ రౌడీ మూకలను ముందుగా ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. దాడి జరగబోతోందని ముందే ఫిర్యాదు చేశామని, మంత్రి చొక్కా విప్పి వీధి రౌడీలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఎన్ఎస్జీ కమాండోలను రెచ్చగొట్టి ఎస్సీలపై కాల్పులు జరిపే కుట్రను అమలు చేశారన్నారు.

మంత్రి సురేష్‌ను బర్తరఫ్ చేయాలి: చినరాజప్ప: చంద్రబాబుపై రాళ్ల దాడి పిరికిపంద చర్య అని మాజీ మంత్రి చినరాజప్ప అభివర్ణించారు. మంత్రి సురేష్ వీధిరౌడీలా ప్రవర్తించారని, తక్షణమే ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడిగురించి ముందే పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, ప్రతిపక్షాలను నిలవరించాలనుకుంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు.
జగన్ ఇంటికే: యనమల: అరాచక పాలనకు నిదర్శనమే చంద్రబాబుపై రాళ్ల దాడి అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్నారు.
పోలీసులేం చేస్తున్నారు?: ఆనందబాబు: చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆక్షేపించారు. ర్యాలీని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దళితులకు ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, మాస్క్‌లు అడిగిన డాక్టర్‌ను పిచ్చోడనే ముద్రవేసి చంపారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళిత డాక్టర్ అచ్చెన్నను హత్య చేసినా ఇంతవరకు చర్యలు లేవని జగన్ సర్కార్ పై మండిపడ్డాడు.












Click it and Unblock the Notifications