మంత్రి విడదల రజనీపై పోటీకి టీడీపీ నుంచి మహిళా పారిశ్రామికవేత్త?
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత టీడీపీ కూడా తమ అభ్యర్ధుల ప్రకటనకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన గుంటూరు పశ్చిమ సీటులో ఈసారి అభ్యర్ధి ఎవరనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ సీటుకు వలసవచ్చిన మంత్రి విడదల రజనీపై పోటీకి ఎవరైతే బావుంటుందనే దానిపై టీడీపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది.
అమరావతి రాజధాని ప్రాంతంలో భాగంగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మద్దాలి గిరి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్ధిని టీడీపీ బరిలోకి దించాల్సి ఉంది. ఈ క్రమంలో తెరపైకి వస్తున్న పేరు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్న మంత్రి విడదల రజనీకి పోటీగా ఓ మహిళా అభ్యర్ధి ఉంటే గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో శ్యామల అభ్యర్ధిత్వంపై చర్చ జరుగుతోంది.

రాజకీయాలకు ఏ మాత్రం పరిచయం లేని లక్ష్మీ శ్యామలను గుంటూరు పశ్చిమ సీటుకు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకూ వ్యాపారం, సామాజిక సేవకే పరిమితమైన ప్రముఖ పారిశ్రామిక వేత్త వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామలను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని టీడీపీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వ్యాపార రంగంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెయిరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జీర్ణోద్దారణలో ఉన్న పలు ఆలయాలను ఆమె పునర్నించారు.
గతేడాది నవంబర్ నెలలో చంద్రబాబు శ్రీ పెరంబదూర్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయనతో పాటే శ్రీ లక్ష్మి శ్యామల సైతం రామానుజుల వారిని దర్శించుకున్నారు. సౌమ్యురాలిగా పేరున్న శ్రీ లక్ష్మి శ్యామలతో ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వ్యాపార వర్గాలతో పాటు సమాజంలో పలు వర్గాలతో విస్తృత పరిచయాలు కూడా ఉన్న లక్ష్మీశ్యామలను బరిలోకి దించితే విడదల రజనీపై ఈ టీడీపీ కంచుకోటలో హ్యాటిక్ విజయం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications