ఏపీలో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల చేరికలు- ఈసీకి టీడీపీ మరో ఫిర్యాదు..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నకిలీ ఓట్ల రచ్చ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున నకిలీ ఓట్లు చేర్పించడం, అకారణంగా ఉన్న ఓట్లు తొలగించడం చేస్తున్నారు. దీనిపై ఈసీ ఇప్పటికే సీరియస్ అయింది. ముఖ్య ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా పలు మార్లు సమీక్షలు నిర్వహించి వీటిపై కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. అయినా నకిలీ ఓట్ల దందా ఆగడం లేదు. దీంతో టీడీపీ ఇవాళ మరోసారి ఈసీకి దీనిపై ఫిర్యాదు చేసింది.
అమరావతిలోని సచివాలయంలో సీఈవో ముకేష్ కుమార్ మీనాతో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఇవాళ మీనాను కలిసి రాష్ట్రంలో నకిలీ ఓట్ల దందాపై ఫిర్యాదు చేశారు. అలాగే భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు చేపడుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాల్ని కూడా వారు సీఈవోకు అందజేశారు.

గతంలో టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్ధాయిలో విచారణలు నిర్వహించిన సీఈవో అధికారుల సస్పెన్షన్ కు కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే పలువురు అధికారుల్ని బదిలీ చేయడంతో పాటు మందలించడం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి టీడీపీ అలాంటి ఆరోపణలతోనే ఆయన్ను ఆశ్రయించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు ఎలా సాగుతుందన్న దానిపై టీడీపీ నేతలు సీఈవోకు వివరించారు.

రాష్ట్రంలో అధికార పార్టీ చెప్పినట్లుగా వింటూ బీఎల్వోలుగా ఉన్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఎలా నకిలీ ఓట్లను చేర్చిస్తున్నారనే దానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వీటిపై ఈసీ నిబంధనల ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. వీటిపై క్షేత్రస్ధాయిలో ఉన్న అధికారులతో మాట్లాడతానని ముకేష్ కుమార్ మీనా చెప్పినట్లు తెలుస్తోంది.వైసీపీ అధికారం లోకి వచ్చాక ఏ ఎన్నికా ప్రజామోదం తో గెలవలేదని, వచ్చే ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని టిడిపి కోరుకుంటోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ లో ఓట్ల దొంగలు పడ్డారని ముందే చెప్పామన్నారు. ప్రతిపక్షాల ఓట్లన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నారన్నారు. అందుకే ఓటర్ ల జాబితా పై ముందు నుంచి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. చంద్రబాబు కూడా దీనిపై సీఈసీకి ఫిర్యాదు చేశారన్నారు.
పర్చూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో జరిగిన అక్రమాల పై ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ అర్ నమోదు చేసినా తదుపరి చర్యలు లేవని అచ్చెన్న ఆరోపించారు. అందుకే ఆయా ఫిర్యాదుల పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఉరవకొండ లో జరిగిన అక్రమాల పై ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారన్నారు. వాలంటీర్ లు ఫార్మ్ 6 ద్వారా , ఫార్మ్ 7 ద్వారా దరఖాస్తుల పై దృష్టి పెట్టాలని కోరామన్నారు. 57 మంది వెయ్యి కంటే ఎక్కువ మందిని ఓటర్ల గా చేర్చే ప్రయత్నం చేశారన్నారు. నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.












Click it and Unblock the Notifications