బోండా ఉమా వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, వాట్ నెక్స్ట్...!!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇప్పుడు పార్టీలో కీలక చర్చగా మారింది. ముద్రగడ సంతాప సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవటం పైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోండా నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ వ్యవహారం లో కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. బోండా ఉమా పార్టీ అడిగితే వివరణ ఇచ్చేందుకు సద్దమని చెబుతున్నారు. కాగా.. గోదావరి జిల్లాలోనూ వైసీపీ నిర్వహించిన సభలో పాల్గొన్న టీడీపీ నేతల అంశం ఇప్పుడు తెర మీదకు వస్తోంది.
ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవటం పార్టీలో దుమారం రేపింది. దీని పైన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శ లు మొదలయ్యాయి. దీని పైన సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ వ్యవహారంపై బొండా ఉమ వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు లను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరులో ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది.

ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమ, వైకాపా నేత అంబటి రాంబాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని తెదేపా అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఇదే సమయంలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో చర్చగా మారాయి. ముద్రగడ కారణంగానే 2019 లో పార్టీ ఓడిపోయిందనే వ్యాఖ్యల పైన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, తన పైన చంద్రబాబు సీరియస్ అయ్యారనే వార్తల పైన తన సన్నిహితులతో బోండా ఉమా స్పందించినట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే ఇస్తానని చెబుతున్నారు. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని... జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యనని చెబుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించానని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు బోండా ఉమా సన్నిహితులు కొత్త అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

వైసీపీ నేత జక్కంపూడి రాజా గోదావరి లో నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వీళ్ళని కూడా వివరణ అడుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను పార్టీకి ఇబ్బంది కలిగించే పని చేయలేదని.. పార్టీకి ఏం జరిగిందో వివరణ ఇస్తానని బోండా ఉమా స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు పార్టీ ఈ వ్యవహారంలో బోండా ఉమా కు ఏం చెప్పబోతున్నదనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications