వైజాగ్ టూ విజయవాడ వయా హైదరాబాద్ ? గంటా శ్రీనివాస్ షాకింగ్ ప్రయాణం..!
ఏపీలో ఆర్ధిక రాజధానిగా చెప్పుకునే విశాఖపట్నం నుంచి రాజధాని అమరావతి వెళ్లేందుకు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకోవాల్సి వచ్చింది. దీంతో సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తన అసంతృప్తిని ట్వీట్ చేశారు. అంతే కాదు కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ఆయన విమాన టికెట్లు కూడా ఫొటో తీసి ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన తాను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందని గంటా తెలిపారు.

ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 15, 2025
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి… pic.twitter.com/kDMWFyjs9I
సీఎం చంద్రబాబుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా తనలాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారని గంటా చెప్పుకొచ్చారు. విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు ఇవాళ మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందన్నారు. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి అంటూ గంటా తన ట్వీట్ ముగించారు.
తాజాగా విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఉదయం బయలుదేరే రెండు విమానాలను ఆయా ప్రైవేటు ఆపరేటర్లు రద్దు చేశాయి. దీంతో విశాఖ నుంచి విజయవాడకు రాకపోకలు తగ్గిపోయాయి. అయితే రాజకీయ నాయకులకు రాజధాని అమరావతితో పనులు ఉంటాయి కాబట్టి ఇలా వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రకే చెందిన కేంద్ర పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నా ఇలా విమాన సర్వీసులు రద్దు కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆయన ఇప్పటివరకూ నోరు మెదపలేదు.












Click it and Unblock the Notifications