తాట తీస్తా.. సొంత పార్టీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి ఘాటు హెచ్చరిక!
తిరువూరు ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ మధ్య రగడ చల్లారటం లేదు. ఇప్పటికే అనేకమార్లు ఇరువురి మధ్య బాహాబాహీ కొనసాగగా, తాజాగా మరోమారు ఇద్దరు మధ్య వార్ బయట చర్చకు కారణం అయ్యింది. తిరువూరు నియోజకవర్గం విజయవాడ లోక్‌సభ పరిధిలో ఉండటం వల్ల స్థానిక ఆధిపత్యం, పార్టీ నియంత్రణపైనే ఈ ఘర్షణలు తీవ్రమవుతున్నాయి.
ఇప్పటికే .2024 ఎన్నికల్లో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని చెప్పారు. తన ఖాతా నుంచి వివిధ వ్యక్తుల ద్వారా డబ్బు బదిలీ చేసినట్లు వివరాలు బయటపెట్టారు.చిన్ని దీన్ని తిరస్కరించారు. "మొన్నటి వరకు నన్ను దేవుడన్నారు.. ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో" అని స్పందించారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఇద్దరినీ పిలిచి విచారించి నివేదిక సీఎం చంద్రబాబుకు అందించింది.

ఆ తర్వాత గంపలగూడెం నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించాలనే విషయంపై వివాదం తలెత్తింది. చిన్ని చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను కొలికపూడి బహిరంగంగా లాక్కుని సమర్పించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆపై మెప్మా ఎన్నికలు, స్థానిక పార్టీ నియామకాలు, ఇసుక, రేషన్ వంటి అంశాలపైనా ఇద్దరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి.
తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి ఒక టీచర్ ను కొట్టారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. దీంతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలపైనే ఘాటుగా స్పందించారు. కేశినేని చిన్నిని టార్గెట్ చేసారు. తనపై వస్తున్న అసత్య ఆరోపణలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని డైరెక్షన్‌లోని నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య గత రెండేళ్లుగా తిరువూరు నియోజకవర్గ అంతర్గత విషయాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బాలకోటయ్య రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసిన లేఖ సోషల్ మీడియాలో తిరుగుతోందని పేర్కొన్నారు."నిజంగా నేను ఉపాధ్యాయుడిని తిట్టినా, కొట్టినా సాక్ష్యాధారాలు ఉంటే అందరి ముందు పెట్టండి. రుజువైతే నేను తలదించుకుని వెళ్లిపోతా. లేకపోతే బాలకోటయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలి" అని కొలికపూడి సవాల్ విసిరారు.
సోమవారం తిరువూరు నుంచి వంద మంది కార్యకర్తలు బాలకోటయ్య కార్యాలయానికి వెళ్తారని, ఆధారాలు చూపించాలని లేదా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తనపై బురదజల్లే వారిని ఇకపై ఊరుకోనని, తోలుతీస్తానని ఘాటుగా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
