వెన్నుపోటు ప్రచారంతో మనస్తాపం?-రాజీనామాకు సిద్దమన్న టీడీపీ ఎమ్మెల్యే..!
ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమికి పలు చోట్ల ఎదురుదెబ్బలు తగిలాయి. సొంత పార్టీకి చెందిన వారు క్రాస్ ఓటింగ్ చేయడంతో టీడీపీ గెలవాల్సిన చోట విపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్దులు గెలుపొందారు. అలాంటి వాటిలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడు పేట మున్సిపాలిటీ కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ అత్యధిక వార్డులు గెల్చుకున్నా.. ఛైర్ పర్సన్ గా నిలబెట్టిన టీడీపీ అభ్యర్ధి మాత్రం ఓటమిపాలయ్యారు. ఇక్కడ వైసీపీ ఛైర్ పర్సన్ పీఠం దక్కించుకున్నారు.
ఈ వ్యవహారం ఇప్పుడు సూళ్లూరు పేట టీడీపీ ఎమ్మెల్యే (TDP Mla) నెలవల విజయశ్రీ (Nelavala Vijayasree) మెడకు చుట్టుకుంది. ఆమె తండ్రి, టీడీపీ సీనియర్ నేత నెలవల సుబ్రమణ్యం సొంత పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి వ్యతిరేకంగా చక్రం తిప్పడం వల్లే ఇక్కడ వైసీపీ క్రాస్ ఓటింగ్ లో గెలిచిందన్న ఆరోపణలు వచ్చాయి. వీరి వల్ల టీడీపీ ఛైర్ పర్సన్ అభ్యర్ధిగా నిలబెట్టిన షేక్ షకీరా.. వైసీపీ అభ్యర్ధి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ చేతిలో 1187 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం వెన్నుపోటు వల్లే ఇలా జరిగిందన్న విమర్శలు వినిపించాయి. దీనిపై ఎమ్మెల్యే విజయశ్రీ ఇవాళ స్పందించారు.

టీడీపీకి తమ కుటుంబం ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉంటుందని విజయశ్రీ తెలిపారు. తమపై వస్తున్న అసత్య ప్రచారాలు తీవ్ర మనస్తాపానికి గురిచేస్తున్నాయని కంటతడి పెట్టుకున్నారు. టీడీపీ తమ కుటుంబానికి పునర్జన్మనిచ్చిందని, భవిష్యత్తులోనూ పార్టీకే కట్టుబడి ఉంటామని అమె వెల్లడించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ నేత రఫీ భార్య షకీరా ఓటమికి స్థానిక కారణాలే కారణమని ఆమె తెలిపారు. రఫీ ఓటమి నెపాన్ని తన తండ్రి నెలవల సుబ్రమణ్యంపై నెట్టడం సరికాదని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలో 5 జడ్పీటీసీలు, 52 ఎంపీటీసీలు గెలిచామని గుర్తుచేశారు. పార్టీ ఓటు బ్యాంకు ఎక్కడా తగ్గలేదన్నారు. క్రాస్ ఓటింగ్ వల్ల మాత్రమే ఈ ఓటమి ఎదురైందన్నారు. అయినా దీని వెనుక తాము ఉన్నామని భావిస్తే రాజీనామా చేసేందుకు కూడా సిద్దమని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రకటించారు.















Click it and Unblock the Notifications
