రిలయన్స్ కు 2600 ఎకరాలు అవసరమా ? అసెంబ్లీలో సోమిరెడ్డి ప్రశ్న..!
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవాళ సొంత ప్రభుత్వాన్ని ఓ ప్రశ్నతో ఇరుకునపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు భూములు కేటాయించిందని, అయితే వాటిని తీసుకున్న సంస్థ ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధీ చేయలేదని సోమిరెడ్డి తెలిపారు. ఇలా పరిశ్రమలకు కేటాయించిన భూములు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం బాధాకరమంటూ సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. తద్వారా ఈ భూముల్ని ఏదో ఒకటి చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
రిలయన్స్ సంస్థకు 2600 ఎకరాలు అవసరమా అని అసెంబ్లీలో సోమిరెడ్డి ప్రశ్నించారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం బాధాకరం అన్నారు. ప్రతి సెజ్ లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతుల త్యాగానికి సార్థకత చేకూర్చాలని కోరుతున్నామన్నారు. నైపుణ్యం కలిగిన విద్యావంతులెందరో మన ప్రాంతంలోనే ఉన్నారని, వారందరికీ ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2008లో 2600 ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు అప్పగించారని, 2008 నుంచి ఆ భూములు ఖాళీగానే ఉన్నాయని సోమిరెడ్డి తెలిపారు. ఎకరాకు రూ.30 వేలు లెక్కన వేసుకున్నా ఏడాదికి రూ.9 కోట్లు ఆదాయం పోయిందన్నారు. ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకారం భూములు కేటాయించిన తర్వాత రెండేళ్లలో పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభం కావాలని, రెండేళ్లు కాకపోయినా నాలుగేళ్లకైనా ప్రారంభించవచ్చన్నారు. అలా కాకుండా ఏళ్ల తరబడి భూములను బీడుగా పెట్టి రైతులు, రైతు కూలీలను పనులు లేకుండా పస్తులు పెట్టడం దురదృష్టకరం అన్నారు.
అప్పట్లో ఎకరాకు రూ.3 లక్షల పరిహారం ఇస్తామంటే తాము ఒప్పుకోలేదన్నారు.తాను ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా రైతులకు అండగా నిలిచి ఎకరాకు రూ.7 లక్షల నుంచి రూ.7.70 లక్షలు ఇప్పించామన్నారు. అప్పట్లో రూ.7 లక్షలకు శంషాబాద్ ప్రాంతంలో వస్తుందని ఆయా కంపెనీల ప్రతినిధులు అభ్యంతరం తెలిపినా తాము రాజీపడలేదన్నారు. పోరాటం సాగించి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించామని గుర్తుచేశారు.
2029 నాటికి రూ.20 వేల కోట్లతో రెండు యూనిట్లు పెడతామని ఇప్పుడు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చిందన్నారు. ఒక్కో యూనిట్ లో 800 నుంచి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటున్నారని, ఆ ఉద్యోగాలను కూడా స్థానికులకే ఇవ్వాలని కోరారు. నైపుణ్యం కలిగిన వారు మన ప్రాంతంలోనే ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. 2600 ఎకరాల భూమి అంతా తమకు అవసరమని రిలయన్స్ సంస్థ చెబుతోందన్నారు. ఆ కంపెనీ పెట్టే పరిశ్రమలకు అంత భూమి అవసరం ఉందా..అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలన్నారు. మిగిలిన భూములను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ఇతర పరిశ్రమలకు అప్పగించాలన్నారు.
రిలయన్స్ సంస్థకు కేటాయించిన భూములే కాదు, జిల్లాలో ఇంకా వేలాది ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయని, పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెన్నార్ డెల్టాలోని 2700 ఎకరాలతో రాచర్లపాడు వద్ద కిసాన్ సెజ్ ఏర్పాటు చేశారని సోమిరెడ్డి గుర్తుచేశారు. కృష్ణపట్నం సెజ్ లో 7 వేల ఎకరాలు, మేనకూరు సెజ్ లోనూ ఇంకా భూములు ఖాళీగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 10 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు ఎంత భూమి ఉన్నా సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం శుభపరిణామం అన్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూములను ఉపయోగంలోకి తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications