తిరుమల వివాదంలో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యేలు
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడిచింది.దీంతో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు టీంను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో జగన్ తిరుమల పర్యటన కూడా వివాదాస్పదమైంది. జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేయడం, దీని వల్ల లడ్డూ వివాదం పక్క దారి పడుతోందని జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం జరిగింది.
జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో కూటమి నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.అయితే డిక్లరేషన్ విషయంలో ఇప్పుడు టీడీపీ నేతలు కూడా చిక్కుకోవడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం చంద్రబాబుతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు)ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్, మనదపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తదితరులు ఉన్నారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్య మతస్తుడు అయినప్పటికీ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వలేదని.. ఇవ్వకుండానే స్వామివారి దర్శనం చేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అలాగే గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ డిక్లరేషన్ పైన సంతకం చేశారని తెలుస్తోంది. ఆయన క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్ పై సంతకం చేశారని చెబుతున్నారు. అయితే క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే థామస్‌కు బీసీ రిజర్వేషన్ మాత్రమే ఉంటుందని, అలాంటప్పుడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు నుంచి రిజర్వేషన్‌తో ఆయన పోటీ చేయడమే అక్రమవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే థామస్, డిక్లరేషన్ ఇవ్వకుండా షాజహాన్ బాషా వివాదంలో చిక్కుకున్నట్టు అయింది.మరి వీరిపై చర్యలు తీసుకోరా అంటూ చంద్రబాబును వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.జగన్‌కు అయితే ఓ రూల్ , తమ పార్టీ ఎమ్మెల్యేలకు అయితే మరో రూలా అంటూ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై చంద్రబాబు సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications