TDP List: ఈసారీ సీనియర్లకు దక్కని సీట్లు-పలుచోట్ల నిరసనలు..!
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా ఇవాళ విడుదలైంది. చంద్రబాబు 34 మంది అభ్యర్ధులతో కూడిన జాబితా ఇవాళ విడుదల చేశారు. ఇందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్లకు సీట్లు దక్కినా మరికొందరికి మాత్రం నిరాశ తప్పలేదు. పలు స్ధానాల్లో సీట్లు ఆశిస్తున్న నేతలకు చంద్రబాబు నేరుగా ఫోన్లు చేసి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో వారి అనుచరులు ఆందోళనలకు దిగుతున్నారు.
ఈ మధ్యే విడుదల చేసిన టీడీపీ తొలి జాబితాలో 94 మందికి చోటు దక్కింది. అయితే ఇందులో చాలా మంది సీనియర్లకు సీట్లు దక్కలేదు. వీరిలో కొందరికి ఇవాళ విడుదల చేసిన రెండో జాబితాలో సీట్లు దొరికాయి. కానీ ఇంకా కళా వెంకట్రావు, దేవినేని ఉమ, బండారు సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలకు సీట్లు దక్కలేదు. దీంతో వీరంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు.

పెందుర్తి టికెట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణమూర్తికి ఇవాళ జాబితాలో పేరు లేకపోవడం, ఈ సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారంతో వెన్నెలపాలెంలో ఆయన నివాసానికి టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. అటు కృష్ణాజిల్లా పెనమలూరు నుంచి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు సీటు లేదని చెప్పేయడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు.
పెనమలూరు టికెట్ ను దేవినేని ఉమా లేదా తుమ్మల చంద్రశేఖర్ కు కేటాయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అటు చంద్రబాబు ఇంటివద్ద పుట్టపర్తి టికెట్ ఆశించిన వడ్డెర సామాజికవర్గం నేతలు నిరసనకు దిగారు. మరోవైపు రెండో జాబితాలోనూ సీటు దక్కకపోవడంతో మరో సీనియర్ గంటా శ్రీనివాసరావు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ తన అనుచరులతో రహస్య భేటీ నిర్వహిస్తున్న ఆయన.. చీపురుపల్లిలో పోటీ చేయాలన్న చంద్రబాబు ఆదేశాలపై చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications