ఈ నియోజకవర్గాల్లో పార్టీని ఓడిస్తున్న తెలుగు తమ్ముళ్లు?
వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. తనతోపాటు నియోజకవర్గ ఇన్ ఛార్జిలు, సీనియర్ నేతలు కూడా శ్రమపడాలని, నిత్యం ప్రజల్లో ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని చెబుతున్నారు. అయినప్పటికీ బాబు మాటలను పెడచెవిన పెట్టడంతోపాటు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపును సీనియర్ నేతలే అడ్డుకుంటున్నారంటే ఆశ్చర్యమేస్తుంది. చంద్రబాబు మొహమాటం కూడా వీరికి కలిసివస్తోంది.

పార్టీ గెలుపును అడ్డుకుంటున్న తమ్ముళ్లు
ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలు పలువురు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో వారిని అడ్డుకుంటోంది ఈ నేతలే. బలమైన నాయకులను కలుపుకొని, బలమైన అధికార పార్టీని ఓడించడానికి కృషిచేయాల్సింది పోయి పార్టీలోనే శల్య సారథ్యం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తప్ప రెండో ఆప్షన్ లేని తరుణంలో తన మొహమాటాన్ని పక్కనపెట్టి కటువైన నిర్ణయాలు తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. అలా కాకుండా ఎప్పటిలాగే నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తే పార్టీ ఓటమిపాలు కావడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మైదుకూరే ఉదాహరణ
ఉమ్మడి కడప జిల్లా మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి బలమైన నేత పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తుండగా ఆయన్ను అడ్డుకుంటోంది అక్కడి స్థానిక నేత అయి పుట్టా సుధాకర్ యాదవ్ అని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వరుసగా రెండుసార్లు నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారని, రానున్న ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి సీటివ్వడంలేదని చంద్రబాబు చెప్పేశారు. మరోసారి ఇక్కడి నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పోటీచేస్తే ఓటమి తథ్యమని, డీఎల్ ను పార్టీలో చేర్చుకొని టికెట్టివ్వాలంటూ మైదుకూరుకు చెందిన నాయకులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications