రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ ? రేసులో ఈ ఇద్దరు అభ్యర్ధులు.. !
ఏపీలో ఈ ఏడాది మార్చిలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు ఇవాళ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 8న రాజ్యసభ దైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే ఫిబ్రవరి 15వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం 16న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 20న నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. చివరిగా ఫిబ్రవరి 27న ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
అయితే ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున ముగ్గురు అభ్యర్ధులూ దాదాపు ఖరారయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, అరణి శ్రీనివాసులతో పాటు వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపుతున్నారు. మరోవైపు టీడీపీ కూడా ఈసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయం తీసుకుంది. గతంలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ ఓట్లకు గండి కొట్టి ఓ అభ్యర్ధి ఓటమికి కారణం కావడంతో పాటు తమ అభ్యర్ధిని గెలిపించుకున్న టీడీపీ.. ఈసారి కూడా అదే వ్యూహంతో బరిలోకి దిగబోతోంది.

ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న టీడీపీకి ప్రస్తుతం కనిపిస్తున్న వాస్తవ బలం 18 మాత్రమే. గతంలో ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేల్ని గెలిచినా నలుగురు వైసీపీకి ఫిరాయించడం, ఓ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాను స్పీకర్ ఇప్పటికే ఆమోదించడంతో 18 మంది మాత్రమే మిగిలారు. అయితే వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన మరో నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు కత్తి వేలాడుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రకటించే నిర్ణయం ఆధారంగా ఈ లెక్క తేలబోతోంది.
అయితే దీంతో సంబంధం లేకుండానే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని రాజ్యసభ సీటు గెల్చేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో టీడీపీ తరఫున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్ధి ఎంపికపై దృష్టిసారించింది. గతంలో ఓసారి ఇలాంటి పరిస్దితుల్లోనే రాజ్యసభకు పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్యతో పాటు కోనేరు సురేష్ ను రాజ్యసభ అభ్యర్ధిగా పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లభించనుంది.












Click it and Unblock the Notifications