కడపలో మహానాడు ఎఫెక్ట్ -వైఎస్ ఫ్యాన్స్ కు బీటెక్ రవి షాకింగ్ సలహా..!
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ కంచుకోటల్ని బద్దలు కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో కీలకమైన కడప జిల్లాలో తొలిసారి మహానాడు కూడా నిర్వహించింది. మహానాడు సందర్భంగా వైఎస్ విగ్రహాలకు పసుపు తోరణాలు కట్టగా.. వైసీపీ శ్రేణులు వాటిని తొలగించాయి. దీంతో వారిపై టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీప పులివెందుల ఇన్ ఛార్జ్ బీటెక్ రవి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లాలోని పులివెందుల రింగురోడ్డు చుట్టూ మాజీ సీఎం వైఎస్ విగ్రహాలు అమర్చారని, మహానాడు సందర్భంగా తాము ఎక్కడ కూడా వాటికి తగిలే విధంగా తోరణాలు కట్టలేదని బీటెక్ రవి తెలిపారు. అయినా టీడీపీ తోరణాలు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ అభిమానులకు బీటెక్ రవి కీలక సూచన చేశారు. నిజమైన వైఎస్సార్ అభిమానులు జగన్ కు మద్దతుపై ఓసారి ఆలోచించుకోవాలని కోరారు.

వైఎస్ విజయలక్ష్మిపై కేసు నమోదు చేయించిన వారెవరో ఆలోచించాలని వైఎస్ అభిమానుల్ని బీటెక్ రవి కోరారు. న్యాయబద్ధంగా షర్మిలా రెడ్డికి రావాల్సిన ఆస్తిని రాకుండా చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి రాముడైతే.. లక్ష్మణుడులా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు. అలాంటి వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని జగన్ పై బీటెక్ రవి విమర్శలు గుప్పించారు.
కడపలో మహానాడు సందర్భంగా వైఎస్ విగ్రహాలకు కట్టిిన తోరణాలు తొలగించిన వ్యవహారంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ సహా 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడమే కాకుండా వాటిని తొలగించారంటూ తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడాన్ని వైసీపీ తప్పుబడుతోంది.












Click it and Unblock the Notifications