75 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించే సత్తా-ఓడిస్తామని పరోక్ష హెచ్చరిక-జగన్ కు టీచర్ల జేఏసీ లేఖ
ఏపీలో పీఆర్సీ పోరు ముగిసిందని ఉద్యోగసంఘాలు ప్రకటించిన తరుణంలో తెరపైకి వచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల జేఏసీ తాజాగా సీఎం జగన్ కు లేఖ రాసింది. పీఆర్సీని ఐదేళ్లకోసారి ఇచ్చే ఆదేశాలు, ఐఆర్ రికవరీ నిలిపివేతతో పాటు ఇతర అంశాలపై ఉద్యోగులకు ఇప్పటికే ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదని గుర్తుచేసింది. వీటితో పాటు తమ పాత డిమాండ్లను తెరపైకి తెచ్చింది. అంతే కాదు రాష్ట్రంలో 75 మంది ఎమ్మెల్యేల్ని ఓడించే సత్తా ఉందంటూ పరోక్ష హెచ్చరికలు కూడా చేసింది.

జగన్ కు టీచర్లు, ఉద్యోగ, పెన్షనర్ల జేఏసీ లేఖ
ఏపీలో మెరుగైన పీఆర్సీ ఫిట్ మెంట్, సీపీఎస్ రద్దు, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్ల జేఏసీ ఘాటుగా లేఖ రాసింది. ఇందులో పలు కీలక అంశాల్నిప్రస్తావించింది. అంతే కాదు పలు హెచ్చరికలు కూడా చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాజకీయంగా దెబ్బతీస్తామంటూ జేఏసీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి. నాలుగైదు సార్లు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడంతో సీఎంకు బహిరంగ లేఖ రాసి విడుదల చేస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు.

పీఆర్సీపై బ్యాలెట్లో తీవ్ర అసంతృప్తి
కొన్ని ఉద్యోగసంఘాలు ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీపై రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని జేఏసీ నేతలు తెలిపారు. దీనిపై తాము నిర్వహించిన అభిప్రాయ ప్యాలెట్ లో ఈ అసంతృప్తి బయటపడిందన్నారు. ఇప్పటికే సీఎం కార్యాలయానికి జేఏసీ తరఫున 2 లక్షల విజ్ఞాపనలు పంపినట్లు జేఏసీ నేతలు తెలిపారు. ముఖ్యంగా పీఆర్సీ ఫిట్ మెంట్ తో పాటు సీపీఎస్ రద్దు కాకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దీకరణ కాకపోవడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు వారు వెల్లడించారు.

నమ్మించి మోసం చేసి దుష్ర్పచారం
రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే మంచి పీఆర్సీ ఇస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని జేఏసీ నేతలు తెలిపారు. ఇప్పుడు ప్రశ్నిస్తే రాజకీయ ముద్రలు వేస్తున్నారని, ప్రభుత్వం, కొన్ని ఉద్యోగసంఘాలు కలిసి తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. టీచర్లను పీఎస్ లకు పిలిపించడం, నల్ల బ్యాడ్జీలు ధరించకుండా ఆంక్షలు విధించడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు.

75 మంది ఎమ్మెల్యేల్ని ఓడిస్తాం?
రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు కలిస్తే 75 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించే శక్తి ఉందంటూ జేఏసీ నేతలు తెలిపారు. తద్వారా తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ 75 మందిని ఓడిస్తామన్న పరోక్ష హెచ్చరికలు పంపుతున్నారు. సమస్యల్ని పరిష్కరించకపోతే తగిన గుణపాఠం చెప్తామంటూ జేఏసీ నేతలు హెచ్చరించారు. త్వరలో పీఆర్సీపై పునస్సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 2 నుంచి 5 వరకూ ఎమ్మెల్యేలు,మంత్రులు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పిస్తామని జేఏసీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications