ప్రియుడు మోసం చేశాడని మహిళా టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మీర్ పేటలో ఓ సాఫ్టువేర్ మహిళా ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మీర్‌పేటలో చోటు చేసుకుంది. మీర్‌పేటకు చెందిన టెక్కీ రాఘవి ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తనను ప్రియుడు సుశీల్ కుమార్ మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
పాలిటెక్నిక్ విద్యార్థి దారుణ హత్య
విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం పులగానిపాలెంలో దారుణం జరిగింది. గత అర్థరాత్రి పాలిటెక్నిక్ విద్యార్థి కిల్లి వినయ్(17)ను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. వినయ్ కాళ్లు, చేతులు కట్టేసి ప్లాస్టిక్ కవర్‌ను ముఖానికి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పాలమూరులో స్వైన్ ఫ్లూ కలకలం
మహబూబ్ నగర్ పట్టణంలో ఒకే కుటుంబంలో నలుగురికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నాయని తేలడంతో కలకలం రేగింది. మహబూబ్‌నగర్ పట్టణంలోని మోతీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి గత మూడు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ జిల్లా ఆసుపత్రికి రాగా, ఆసుపత్రి వైద్యులు ఆయనను హైదరాబాద్‌కు చికిత్స నిమిత్తం తరలించారు.
అక్కడ రోగికి వైద్య పరీక్షలు నిర్వహించగా స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు మంగళవారం నిర్ధారించారు. ఈ విషయం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వడంతో స్వైన్ ఫ్లూ సోకిన రోగి కుటుంబ సభ్యులను కూడా జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేశారు.
దాంతో కుటుంబంలో మరో నలుగురికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం పాలమూరు పట్టణంలో పొక్కడంతో ప్రజలు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. పాలమూరు పట్టణంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి వచ్చిందంటూ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్‌లో ఒకరు చికిత్స పొందుతుండగా, మరో నలుగురికి జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి సూపరిండెంటెంట్ చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక స్వైన్ ఫ్లూ వార్డులో వ్యాధి లక్షణాలు ఉన్న వారికి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications